హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి కుసుమ్ స్కీమ్‌పై రైతుల అభ్యంతరాల నేపథ్యంలో టీజీరెడ్కోతో ఒప్పందాలకు బ్రేక్ పడింది. పొలాల్లో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్లకు సంబంధించిన స్పష్టత ఇచ్చేవరకు పీపీఏలపై సంతకాలు చేయబోమని రైతులు స్పష్టంచేశారు. పీఎం కుసుమ్ స్కీమ్‌లో ఒప్పందం చేసుకునేందుకు రావాలంటూ టీజీరెడ్కో అధికారులు రైతులకు సూచించారు. ఈ అంశంపై ఆదివారం ‘రైతులపైనే సోలార్ ప్లాంట్ల విద్యుత్తు భారం’ శీర్షికతో నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితమైంది. రైతులకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలను ఈ కథనం బయటపెట్టింది.
అధికారుల ఆహ్వానం మేరకు తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి రైతులు హైదరాబాద్‌లోని టీజీరెడ్కో కార్యాలయానికి వచ్చి తమ అభ్యంతరాలను పరిగణిలోకి తీసుకోవాలని, అనుమానాలను నివృత్తిచేయాలని కోరారు. అంతవరకు పీపీఏలపై సంతకాలు చేయబోమని తేల్చిచెప్పారు. దీంతో టీజీరెడ్కో వీసీ అండ్ ఎండీ అనిల, సీజీఎం ప్రభాకర్ రైతులతో చర్చలు జరిపారు. తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీహరిబాబు, ఉపాధ్యక్షుడు రాజేశ్, జాయింట్ సెక్రటరీ బాబునాయుడు చర్చల్లో పాల్గొని సందేహాలు వ్యక్తంచేశారు. రైతులకు స్పష్టత ఇచ్చేందుకు ఒక అధికారిని నియమించామని, కాల్ చేసి సందేహాలు నివృత్తిచేసుకోవచ్చని అధికారులు తెలిపారు.