Sircilla Collector | సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు హైకోర్టు వారెంట్ జారీ చేసింది. ఓ కేసు విషయంలో ఇవాళ న్యాయస్థానానికి హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. గైర్హాజరవ్వడమే కాకుండా ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంపై ఆయనకు వారెంట్ ఇష్యూ చేసింది.
మిడ్ మానేరులో తన ఇంటిని కోల్పోయినప్పటికీ.. అధికారులు నష్టపరిహారం చెల్లించలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామానికి చెందిన నిర్వాసితుడు వేల్పుల ఎల్లయ్య గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారించిన హైకోర్టు.. ఎల్లయ్యకు పరిహారం చెల్లించాలని గత జూన్లో తీర్పు వెలువరించింది. ఈ మేరకు కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎల్లయ్యకు ఎలాంటి పరిహారం చెల్లించలేదు.
ఈ నేపథ్యంలో దీనిపై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇవాళ కోర్టుకు హాజరుకావాలని గతంలోనే నోటీసులు పంపించింది. కానీ ఆ నోటీసులకు సందీప్ కుమార్ ఝా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. పైగా దీనిపై ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు న్యాయమూర్తి వారెంట్ ఇష్యూ చేసినట్లుగా పిటిషనర్ తరఫున న్యాయవాది వెల్లడించారు.