కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ న్యాయపోరాటానికి దిగింది. జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన ఏకపక్ష నివేదికపై హైకోర్టు తలుపు తట్టింది. కమిషన్ ఏర్పాటులోనే రాజకీయ కుట్ర దాగి ఉన్నదని, గత ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఏకపక్షంగా విచారణ సాగిందని బీఆర్ఎస్ ఇప్పటికే విమర్శిస్తున్నది. ఈ నేపథ్యంలో గురువారం హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు జీవోను, దాని నివేదికను రెంటినీ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ప్రారంభించింది.
ప్రభుత్వానికి ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత అందులోని అంశాలకన్నా, కమిషన్ విచారణ తీరు ఎక్కువ చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే క్రమంలో కమిషన్ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఇప్పటికే అటు రాజకీయ, ఇటు న్యాయవర్గాల్లో విస్తృతచర్చ సాగుతున్నది. కాంగ్రెస్ సర్కారు రాజకీయ దురుద్దేశంతోనే కమిషన్‌ను ఏర్పాటు చేసిందనేది సుస్పష్టం. అయితే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్‌కు భిన్నంగా విచారణ సాగిందని పలువురు న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పినాకీ చంద్రఘోష్ సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించిన తరువాత చర్యలపై నిర్ణయం తీసుకుంటారా? లేక నివేదికపై చర్యలకు ఆదేశాలు జారీ చేశాక అసెంబ్లీలో చర్చిస్తారా? ఇది ఎంతో కీలకం. దీనిపైనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుల పిటిషన్ ఆధారపడి ఉన్నది.
– హైకోర్టు ధర్మాసనం
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్న చిరకాల కలను సాకారం చేసేందుకు ప్రాణత్యాగానికి సిద్ధపడిన కేసీఆర్‌పై నిందలు మోపుతారా? అన్ని నిర్ణయాలనూ నాటి సీఎంగా ఉన్న కేసీఆర్ ఒకరే తీసుకున్నారని చెప్పడం ఏకపక్షం. వేరే వాళ్ల భుజసంధాలపై తుపాకీ పెట్టి కాల్పులు జరిపినట్టు కమిషన్ రిపోర్టు ఉంది. మంత్రివర్గం, ఇంజినీర్ల కమిటీల నివేదికల మేరకు నిర్ణయాలు తీసుకుంటే కేసీఆర్ ఒకరే అన్ని నిర్ణయాలు తీసుకున్నారని వేటి ఆధారంగా చెప్తారు? కమిషన్ నివేదికను సంక్షిప్తం చేసి 60 పేజీల నివేదికను అధికారిక వెబ్సైట్లో పెట్టారు. మీడియాకు కూడా ఆ నివేదిక చేరింది. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలే అందుకు సాక్ష్యం. ఆ కథనాలను పరిశీలన చేయండి. సీఎం సారథ్యంలో జరిగిన సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆ నివేదికలోని వివరాలను వెల్లడించడంలో ఆంతర్యం ఏమిటి? జ్యుడీషియల్ కమిషన్‌కు ఉన్న నిర్వచనం రామనాథన్ అయ్యర్ నిఘంటువులో విపులంగా ఉంది. విచారణ పూర్తిచేసి బాధ్యులను గుర్తించడం మాత్రమే కమిషన్ పని అని ఆ నిఘంటువులో చాలా స్పష్టంగా ఉంది. కమిషన్ మొత్తం 119 మంది సాక్షులను విచారించింది. అందులో చిట్ట చివరి వ్యక్తి కేసీఆర్. ఆయనకు ముందు వచ్చిన సాక్షులు కేసీఆర్, హరీశ్‌లకు వ్యతిరేకంగా అభియోగాలు చేసి ఉంటే సెక్షన్ 8బీ, సెక్షన్ 8సీ కింద పిటిషనర్లకు క్రాస్‌ఎగ్జామ్ చేసేందుకు ఎందుకు అనుమతివ్వలేదు. రాజకీయంగా దెబ్బతీయడం, తెలంగాణ సాధనకు ఉద్యమించిన నేత ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి’ అని కేసీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పినాకిచంద్రఘోష్ సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించిన తరువాత చర్యలపై నిర్ణయం తీసుకుంటారా లేక నివేదికపై చర్యలకు ఆదేశాలు జారీ చేశాక అసెంబ్లీలో చర్చిస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇది ఎంతో కీలకమని, దీనిపైనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పిటిషన్ ఆధారపడి ఉన్నదని గుర్తుచేసింది. హైకోర్టు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేమని, ప్రభుత్వ వివరణ తెలుసుకొని చెప్పడానికి రెండుమూడు రోజుల గడువు కావాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి కోరారు.
ఇది కీలక విషయమని, ప్రభుత్వ వివరణ తెలుసుకుని శుక్రవారం జరిగే విచారణలో తెలియజేయాలని హైకోర్టు తేల్చిచెప్పింది. విచారణను మంగళవారానికి వాయిదా వేయాలన్న ఏజీ అభ్యర్థనను తోసిపుచ్చింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకిచంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. కమిషన్ విచారణ పూర్తిచేసి గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వానికి 650 పేజీల నివేదికను సమర్పించింది.
కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ గురువారం విచారణ జరిపింది. దాదాపు రెండున్నర గంటలకుపైగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆర్యమ సుందరం, దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక ఏకపక్షంగా ఉన్నదని, సాక్షిగా విచారణకు పిలిచి వివరాలు కోరితే పిటిషనర్లు ఆ మేరకు తెలియజేశారని వివరించారు.
ఇతర సాక్షులు లేదా పత్రాల ద్వారా పిటిషనర్లకు వ్యతిరేకంగా అభియోగాలు ఉన్నాయని కమిషన్ భావిస్తే, విచారణ కమిషన్ చట్టం-1952లోని సెక్షన్ 8-బీ కింద పిటిషనర్లకు నోటీసు ఇవ్వాలన్న నిబంధనను జస్టిస్ పీసీ ఘోష్ ఉల్లంఘించారని తెలిపారు. పిటిషనర్లకు వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పి ఉంటే వాళ్ల సమక్షంలో కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని అన్నారు. కమిషన్ విచారణకు పిలిచిన చిట్టచివరి సాక్షి మాజీ సీఎం కేసీఆర్ అని, నిజంగానే కమిషన్ వద్ద ఆయనకు వ్యతిరేకంగా అభియోగాలు ఉంటే, వాటిపై కేసీఆర్‌ను ప్రశ్నించాలని అన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ ముందస్తు పథకం ప్రకారం ఆరోపణలు చేస్తూ వచ్చిందని చెప్పారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఒక కుట్ర ప్రకారం అడుగులు వేసిందని అన్నారు. అప్పటికే భారీ వర్షాల కారణంగా మేడిగడ్డ రిజర్వాయర్‌లోని ఒకే ఒక పిల్లర్ కుంగితే, దీనిని సాకుగా తీసుకుని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఏదేదో జరిగిపోయిందని చెప్పి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్ లపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జ్యుడీషియల్ కమిషన్ తీరు చట్ట వ్యతిరేకంగా ఉన్నదని కేసీఆర్ తరఫు న్యాయవాదులు చెప్పారు. రాజకీయ ఉద్దేశంతో కమిషన్ ఏర్పాటు జరిగిందని అన్నారు. దీనివెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వకీర్తిని కించపర్చాలన్న రాజకీయ కుట్ర ఉన్నదని తెలిపారు. వాస్తవానికి గోదావరి జలాలతో తెలంగాణలోని భూములకు సాగునీరు అందిస్తామంటూ 2007లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుగా ప్రణాళిక రూపకల్పన జరిగినప్పటికీ మహారాష్ట్రతో తలెత్తిన అంతర్రాష్ట్ర సమస్యలు, నీటి కొరత కారణంగా ఆ ప్రాజెక్టులో కదలిక లేకపోయిందని చెప్పా రు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కో స్ ద్వారా జరిపించిన సర్వే నివేదికను అధ్యయనం చేసి.. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వద్ద బరాజ్‌ల నిర్మాణాలతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టాలని అప్పుడు సీఎంగా ఉన్న పిటిషనర్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. దీనికి సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీల నుంచి అధికారిక అనుమతులు లభించాయని చెప్పారు. కానీ కమిషన్ ఇచ్చిన నివేదికలో మాజీ సీఎం కేసీఆరే స్వయంగా ప్రాజెక్ట్ ప్రదేశాలను ఎంపిక చేశారని పేరొనడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా పరిపాలనా అనుమతులు పొందారని నివేదికలో పేరొనడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
కాంట్రాక్టర్లకు అనుకూలంగా, అదనపు పనులకు మౌఖిక ఆదేశాలిచ్చారనే విషయంలో కూడా వాస్తవం లేదని చెప్పారు. మూడు బారాజ్లలో పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేయించడం వల్ల మేడిగడ్డకు నష్టం వచ్చిందనేది అభూతకల్పన అని అభివర్ణించారు. ప్రణాళిక నుంచి నిర్మాణం వరకు అనేక ఆర్థిక, విధానపర లోపాలు చోటు చేసుకున్నాయని, పిటిషనర్లు ఇద్దరూ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణమని కమిషన్ తేల్చే ముందు వారికి నోటీసులు ఇవ్వలేదని న్యాయవాదులు తెలిపారు.
కమిషన్ నిజనిర్ధారణ మాత్రమే చేయాలని, ఎవరు తప్పు చేశారో, ఎవరు ఒప్పు చేశారో తేల్చే అధికారం దానికి లేదని అన్నారు. విచారణ కమిషన్ చట్టంలోని సెక్షన్ 8-బీ- 8-సీ ప్రకారం, ఒక వ్యక్తి తీరును తప్పుపడుతూ ఆరోపణలు ఉంటే ఆ వ్యక్తికి నోటీసులు ఇచ్చి క్రాస్ ఎగ్జామిన్ చేయాలని సుప్రీంకోర్టు పలు కేసుల్లో తీర్పులు చెప్పిందని గుర్తుచేశారు. కమిషన్ పనితీరు సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా, ప్రాథమిక న్యాయసూత్రాలను ఉల్లంఘించేదిగా ఉన్నదని చెప్పారు. పిటిషనర్లకు వ్యతిరేకంగా అభియోగాలు ఉండి ఉంటే వారికి నిర్దోషులుగా నిరూపించుకొనే అవకాశం ఇవ్వాలని అన్నారు.
కమిషన్‌కు శిక్ష విధించే అధికారం లేదని రామకృష్ణ దాల్మియా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పిందని అన్నారు. కిరణ్‌బేడి కేసులో 8-బీ సెక్షన్ కింద నోటీసు ఇవ్వలేదని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని తెలిపారు. వ్యక్తి ప్రతిష్ట దెబ్బతినేలా విచారణ కమిషన్ వ్యవహారం ఉండరాదని ఎల్కే అద్వానీ-బీహార్ మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. వేర్వేరు కేసులలో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరారు.
ప్రభుత్వానికి కమిషన్ 650 పేజీల నివేదిక ఇస్తే దానిని 60 పేజీలకు కుదించారని తెలిపారు. దీనిని ఆధారంగా చేసుకుని సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పిటిషనర్లు దారుణమైన తప్పులు చేశారని తేల్చడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కమిషన్ నివేదికను మంత్రివర్గం ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, సభ నిర్ణయానికి అనుగుణంగా నివేదికపై తదుపరి చర్యలు ఉండాలని, అయితే, సీఎం ముందుగానే నివేదికలోని కీలక విషయాలను బహిర్గతం చేశారని తప్పుపట్టారు. ప్రజాజీవితంలో ఉన్న పిటిషనర్ల ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర దాగి ఉన్నదని అన్నారు. తక్షణమే హైకోర్టు స్పందించి పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. తుది తీర్పులో కమిషన్ నివేదికను రద్దు చేయాలని, కమిషన్ ఏర్పాటు జీవో-6ను కూడా రద్దు చేయాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమర్థంగా, విజయవంతంగా జరిగిందని, దీంతో వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా నిలిచిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెప్పారు. జంటనగరాలు, అనేక పట్టణాలకు తాగునీటి సదుపాయం లభించిందని తెలిపారు. మూడు బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల టన్నెళ్లు, 1531 కిలోమీటర్ల కాలువలు, 38 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 530 మీటర్ల ఎత్తిపోతల వ్యవస్థతో 240 టీఎంసీల నీటి వినియోగం కోసమే ప్రాజెక్టును నిర్మించారని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కమిషన్ ముందున్న సమాచారం ఆధారంగా సెక్షన్ 8-బీ, 8-సీ కింద నోటీసు ఇవ్వాలో లేదో కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. మేడిగడ్డ రిజర్వాయర్ దెబ్బతిన్నదని, ప్రమాదకరంగా మారిందని చెప్పారు. కమిషన్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని, శాసనసభ సమగ్రంగా చర్చిస్తుందని, పిటిషనర్లు ఇద్దరూ అదే సభలో సభ్యులుగా కూడా ఉన్నారని తెలిపారు. సభలో చర్చించాక నివేదికపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో తుది నిర్ణయం ఉంటుందని, ఈలోగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. రెండు వ్యాజ్యాలను కొట్టివేయాలని, లేనిపక్షంలో తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేస్తామని చెప్పారు. వాదనల అనంతరం ద్విసభ్య ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
‘జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చ చేస్తారా? లేక చర్యలు తీసుకున్నాక చర్చ చేస్తారా? ఈ కేసులో ఈ రెండు ప్రశ్నలే అత్యంత కీలకం. దీనిపై వచ్చే మంగళవారం ప్రభుత్వం వివరణ ఇస్తామంటే కుదరదు. రేపే అంటే శుక్రవారమే చెప్పాలి. ఇంతకీ నివేదిక ఏ దశలో ఉంది? పిటిషనర్లు కేసీఆర్, హరీశ్‌రావుకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్-1952లోని 8బీ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వలేదా? వారిద్దరూ సాక్షులుగానే కమిషన్ ఎదుట హాజరయ్యారా? కమిషన్ యాక్ట్‌లోని 5(2) సెక్షన్ కింద అంటే సాక్షిగా హాజరుకావాలని వాళ్లకు కమిషన్ నోటీసు ఇచ్చిందా? క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు సెక్షన్ 8-సీ నోటీసు కూడా ఇవ్వలేదా? ఇంతకీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారు? కమిషన్ రిపోర్టు అధికారికంగా విడుదల చేశారా? నివేదిక మీడియాలో ప్రచురణ-ప్రసారం అయ్యిందా? రిపోర్టు పబ్లిక్ డొమైన్లో ఉందా? ఆ మీడియాకు రిపోర్టు ఎలా చేరింది?’ అంటూ విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
‘కాళేశ్వరం ప్రాజెక్టుపై సాక్షిగా హాజరుకావాలని 5(2) సెక్షన్ కింద జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసు ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో సాక్షిపై నిందలు మోపారు. ప్రభుత్వం సంక్షిప్తం చేయించిన 60 పేజీల నివేదికలో పలు అభియోగాలు ఉన్నాయి. సాక్షిపై ఎలా అభియోగాలు మోపుతారు? సెక్షన్ 8బీ, 8సీ కింద నోటీసులు ఇచ్చి ఆరోపణలు చేసిన వాళ్లను క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు. ఎల్కే అద్వాణీ, కిరణ్‌బేడి కేసులలో సాక్షులను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్దిష్ట మార్గదర్శకాలు చేసింది. అందుకు విరుద్ధంగా కమిషన్ చర్యలున్నాయి. సహజ న్యాయసూత్రాలకు తిలోదకాలిచ్చింది’ అని హరీశ్‌రావు తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదించారు.