TG High Court | కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు లాయర్ ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని, నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని తెలిపారు. నివేదికను కేసీఆర్, హరీశ్‌రావుకు అందించలేదని, కమిషన్ నివేదికపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిందన్న సుందరం పేర్కొన్నారు. రాజకీయంగా నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారని, సీఎం విలేకరుల సమావేశంలో కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించారని.. వెబ్సైట్లోనూ అప్లోడ్ చేశారని.. కేసీఆర్‌కు మాత్రం నివేదిక కాపీలు ఇవ్వలేదని, నివేదిక కాపీలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదన్నారు.
కమిషన్ నివేదికపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని.. కమిషన్ నివేదిక ఆధారంగా కమిటీ 60 పేజీల నివేదికను రూపొందించినట్లుగా న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే, అసెంబ్లీలో చర్చించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. ఇద్దరు పిటిషనర్లు అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని ఏజీ పేర్కొనగా.. అలాంటప్పుడు నివేదికను ఎందుకు బయటపెట్టారని హైకోర్టు ప్రశ్నించింది. మీడియా సమావేశంలో ప్రతి విలేకరికి 60 పేజీల నివేదికను ఇచ్చారని కేసీఆర్ తరఫు న్యాయవాది సుందరం సీజే ధర్మాసనానికి తెలిపారు. కోర్టుకు సమర్పించిన నివేదిక కాపీలు సరిగా కనబడడం లేదని సీజే తెలిపారు. స్పష్టంగా కనపడేలా ఉన్న కాపీలు సమర్పిస్తే తర్వాత విచారిస్తామన్నారు. అయితే, ప్రాధాన్యం దృష్ట్యా విచారణ ఇవాళే కొనసాగించాలని కేసీఆర్ తరఫు న్యాయవాది సుందరం హైకోర్టు సీజేకి విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రజాధనాన్ని దృష్టిలో ఉంచుకొని జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం వేసిందని ఏజీ పేర్కొన్నారు.
నివేదికను కేబినెట్ సులభంగా అర్థం చేసుకునేలా 60 పేజీలు రూపొందించారని, 60 పేజీల నివేదిక ఆధారంగా ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించిందన్నారు. అసెంబ్లీలో చర్చించి తదుపరి చర్యలు తీసుకునేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని, అసెంబ్లీలో చర్చించే వరకు పిటిషన్‌ను విచారణ చేపట్టొద్దన్న ఏజీ.. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. అయితే, సెక్షన్ 8బీ కింద నోటీసులివ్వలేదని పిటిషనర్లు తప్పుపట్టడం చెల్లదన్న ఏజీ.. కమిషన్ నివేదిక అధికారికంగా విడుదల చేశారా? అని హైకోర్టు ప్రశ్నించింది. సెక్షన్ 8బీ కింద కాకుండా ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్ నివేదిక ప్రస్తుతం ఏ దశలో ఉందని ఏజీని ప్రశ్నించిన ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా?.. అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా? అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పేందుకు సమయం కావాలని హైకోర్టును ఏజీ కోరారు. దాంతో కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.