Heavy Rains | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం హైదరాబాద్ నుంచి మంత్రులతో కలిసి, ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 72 గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. జిల్లాల్లో ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూమ్‌కు వెంటనే చేరేలా చూడాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పశుసంపదకు నష్టం జరగడానికి వెళ్లేదన్నారు. సహాయక చర్యలకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి విద్యుత్ అంతరాయం కలగకుండా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి అందులో ఉన్న నివాసతులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులనుబట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. అవసరమైతేనే తప్ప రోడ్లపైకి రావద్దని ప్రజలకు సూచించాలన్నారు. రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ రహీముద్దీన్, జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారి శ్రీనివాస్, విద్యుత్ శాఖ డీఈ తిరుపతిరావు, వైద్య శాఖ అధికారి సిద్ధప్ప, ఆర్ అండ్‌బీ ఈఈ ప్రగతి, వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారి హరికృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.