TG ECET | ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12న నిర్వహించనున్న టీజీ ఈసెట్ – 2025 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 19,672 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికోసం 86 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షా కేంద్రాన్ని ముందస్తుగా చూసుకోవాలని సూచించారు. పరీక్షను ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కోరారు. పరీక్ష ప్రారంభానికి నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు.