హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ల జారీలో జాప్యమవుతుంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మొదలుకుని, ఇటు వర్సిటీల వరకు కాలేజీలకు గుర్తింపు జారీలో ఆలస్యమవుతుంది. ఫలితంగా ఎప్‌సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ వారంపాటు వాయిదాపడింది. ఈనెల 27 నుంచి ప్రారంభంకావాల్సిన కౌన్సెలింగ్‌ను జూలై 4కు వాయిదావేశారు. పలు ఇంజినీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ గుర్తింపును జారీచేయలేదు. లోపాలున్న కాలేజీలు గుర్తింపు పొందేందుకు ఈ నెల 30 వరకు అవకాశామిచ్చింది. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు సైతం ఏఐసీటీఈ అనుబంధ గుర్తింపును జారీచేయలేదు. కాగా, గతంలో ప్రకటించిన ఎప్‌సెట్ మూడు విడుతల షెడ్యూల్‌ను సవరించి కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఈ యేడు ఇంటర్నల్ స్లైడింగ్‌ను కన్వీనర్ కోటాలో చేపట్టనున్నారు. తుది విడుత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఆగస్టు 9, 10తేదీల్లో ఇంటర్నల్ స్లైడింగ్‌ను చేపడతారు. మూడు విడుతల కౌన్సెలింగ్‌లో ఒక కాలేజీలో సీట్లు పొందిన విద్యార్థి అదే కాలేజీలో మరో బ్రాంచీలో సీటు ఖాళీగా ఉంటే ఇంటర్నల్ స్లైడింగ్ విధానంలో ఆయా సీటును ఎంపికచేసుకోవచ్చు. ఈ విధానంలో బ్రాంచి మారిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించేది కాదు. కానిప్పుడు ఈ ఇంటర్నల్ స్లైడింగ్‌ను కన్వీనర్ కోటాలోనే చేపట్టనుండటంతో ఆయా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది.