హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఫలితాలు విడుదల చేశారు. పేపర్-1లో 59.48 శాతంతో 41,327మంది, పేపర్-2లో 31.21శాతంతో 42,384 మంది ఉత్తీర్ణులయ్యారు. టెట్ పరీక్షలను ఈ నెల 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో నిర్వహించగా, 2,75,753 మంది హాజరయ్యారు. బుధవారం ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ తర్జనభర్జనలు పడింది.
కానీ ప్రభుత్వం నుంచి అనుమతిరావడంతో ఎట్టకేలకు బుధవారమే టెట్ ఫలితాలు ప్రకటించారు. ర్యాంకు కార్డులను బుధవారం నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ హరిత, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ్ పాల్గొన్నారు.