SSA | మెదక్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట గత 15 రోజులుగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి మెదక్ పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన శిబిరాన్ని రూరల్ పోలీసులు బలవంతంగా తొలగించి, ఉద్యోగులను పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. అయితే పోలీసుల తీరును నిరసిస్తూ ఉద్యోగులు స్టేషన్లోనే బైఠాయించి సర్కార్‌కు వ్యతిరేకంగా నినదించారు. ఈ ఘటనను సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. దౌర్జన్యంగా టెంట్ తొలగించి సమ్మెలో ఉన్న ఉద్యోగులను స్టేషన్లో నిర్బంధించడం దారుణమన్నారు.
టెంట్లు పీకేసే బదులు వారి సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఛాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి, ఏడాది గడిచినా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న విధంగానే సమగ్ర శిక్షా ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి మో సం చేశారని ఆరోపించారు. రోడ్డెకి నిలదీస్తే అక్రమ నిర్బంధాలకు గురిచేస్తున్నారని, ఇది హేయమైన చర్య అని మండిపడ్డారు. నిర్బంధించిన సమగ్ర శిక్షా ఉద్యోగులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.