హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయాన్ని ముట్టడించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకున్నది. పలువురు విద్యార్థులపై పోలీసులు పిడిగుద్దులతో దాడిచేసి బలవంతంగా అరెస్టు చేశారని నాయకులు ఆరోపించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యల పరిషారం కోరుతున్న విద్యార్థులపై నిర్బంధం ప్రయోగించడం ప్రభుత్వ ప్రజాస్వామ్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తవుతున్నప్పటికీ విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని నియమించకపోవడం విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నదని మండిపడ్డారు. శుక్రవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఏఐడీఎస్వో, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్బీ, ఏఐపీఎస్యూ సంఘాలు వెల్లడించాయి.