బేగంపేట్ అక్టోబర్ 14 : సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంపై ఓ ఆగంతకుడు సోమవారం తెల్లవారుజామున దాడిచేసి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. కాళ్లతో తన్నుకుం టూ లోనికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని కాళ్లతో తన్నుతూ పడగొట్టాడు. ఆలయం గద్దెపైకి ఎక్కి మరింత ధ్వంసానికి పాల్పడుతుండగా స్థానికులు పట్టుకొని కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని మొదట గాంధీ దవాఖానకు, అటునుంచి నిమ్స్‌కు తరలించారు. ఆ ఉన్మాది వీరంగమంతా సీసీ కెమెరాలో రికార్డు కాగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. కుమ్మరిగూడకు చెందిన చెల్మెల కిరణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడు గుర్తుతెలియని ముస్లింగా పేర్కొన్నా రు.అతడిపై 333,331(4), 196,298, 299 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నిందితుడు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియోలు బయటకు రావడంతో సికింద్రాబాద్‌లో పోలీసులు పెద్ద సంఖ్యలో పహారా ఏర్పాటు చేశారు. నగర సీపీ సీవీ ఆనంద్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, బీజేపీ నాయకురాలు మాధవీలత వచ్చి స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనను నిరసిస్తూ స్థానికులు హిందూ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున్న వచ్చి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆగంతకుడు ముంబయికి చెందిన సలీం సలాం ఠాకూర్ అని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. ఇతడిపై ముంబయిలోనూ 2022లో గణేశ్ మండపంలో విగ్రహాల ధ్వంసం, ఈ ఏడాది ఆగస్టులో శివాలయంలో విగ్రహం ధ్వంసం చేసిన కేసులు నమోదయినట్టు సమాచారం.
హైదరాబాద్/సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతున్నదని, ఇలాంటి తెలివి తక్కువ చర్యలు నగర ప్రతిష్టకు మచ్చలాంటివని, ఆగంతకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రోజురోజుకూ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని,ఈ ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడి ఆక్షేపణీయమని పేర్కొన్నారు. మూర్ఖపు చర్యలతో నగర ప్రతిష్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తంచేశారు.
ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడి అత్యంత దారుణం, అనాగరికమని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.