చిక్కడపల్లి, జూన్ 11: నిరుద్యోగులు పోరుబాట పట్టారు. చిక్కడపల్లి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏకమైన నిరుద్యోగులు చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో గురువారం సాయంత్రం మహాధర్నా నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని నినదించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు చేసిన నినాదాలతో సిటీ సెంట్రల్ లైబ్రరీ ద ద్దరిల్లింది.
‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ, వియ్ వాంట్ జస్టిస్, వాడెవడు.. వీడెవ్వడు.. నిరుద్యోగులకు అడ్డెవ్వరు..’ అంటు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ధర్నా విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు చిక్కడపల్లి లైబ్రరీ వద్ద మధ్యాహ్నం నుంచే భారీ ఎత్తున మోహరించారు. నిరుద్యోగులు అశోక్‌నగర్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు గేటు వద్దనే అడ్డుకున్నారు. లైబ్రరీ గేటుకు తాళాలు వేసి వారిని పోలీసులు నిరోధించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
‘మేము టెర్రరిస్టులమా? నిరసన తెలిపే హక్కు మాకు లేదా?’ అని నిరుద్యోగులు ప్రశ్నించారు. సాయంత్రం గ్రంథాలయ సిబ్బంది బయటకు వెళ్లే సయమంలో పోలీసులు గేటు తెరువడంతో అశోక్‌నగర్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు నిరుద్యోగులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిని అరె స్టు చేసి ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే అరెస్టు చేస్తా రా? అని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని అణచి వేయలేరని హెచ్చరించారు. అరెస్టయిన జేఏసీ నేతల్లో రవికుమార్, కయ్యే వెంకటేశ్, కిరణ్, బాలకోటి, సురేష్, తదితరులు ఉన్నారు.
కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలతోపాటు 20 వేల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు రవికుమార్, క య్యే వెంకటేశ్ మాట్లాడుతూ.. కానిస్టేబు ల్ అభ్యర్థులకు 36 ఏండ్లు, ఎస్సై అభ్యర్థులకు 38 ఏండ్లకు వయోపరిమితిని పెం చాలని డిమాండ్ చేశారు. జీవో-46ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.