హైదరాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతిపాదిత హ్యామ్ (హైబ్రిడ్ యాన్యూటీ మోడ్) రోడ్లకు వచ్చే వారం టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తొలి దశలో రూ.ఆరువేల కోట్ల నిధులతో రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టి, వాటిని మూడేండ్లలో పూర్తిచేస్తామని పేర్కొన్నారు. మంత్రి వెంకటరెడ్డి అధ్యక్షతన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ), కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) ప్రాజెక్టులపై వివిధ శాఖల అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సచివాలయంలో గురువారం సమావేశమైంది. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పనులు, అనుమతులపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు.
ఈ నెల 12న హ్యామ్ రోడ్లపై కాంట్రాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు వెంకటరెడ్డి వెల్లడించారు. ఫ్యూచర్‌సిటీ నుంచి విజయవాడ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేను కేంద్రం మంజూరు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ్రట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి ఈ నెలాఖరులోగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నదని గడ్కరీ హామీ ఇచ్చారని చెప్పారు. నల్లగొండ రింగ్‌రోడ్ నిర్మాణానికి టెండర్లు పిలిచినట్టు వెల్లడించారు. సనత్‌నగర్ టిమ్స్ దవాఖాన పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ వచ్చే దసరా నాటికి పూర్తవుతుందని చెప్పారు. సినీ కార్మికుల సమస్య కొలిక్కొస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.