హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ) : తనవారి కోసం ఓ అధికారి సబ్స్టేషన్ల నిర్వహణ టెండర్ నిబంధనలకు నీళ్లొదిలి, జీవో 94లో ఉన్న నిబంధనలకు తూట్లు పొడిచారంటూ రాష్ర్టానికి చెందిన టెండర్‌దారులు మండిపడుతున్నారు. తనకు సబంధించిన పక్కరాష్ట్రం కంపెనీకి టెండర్ కట్టబెట్టేందుకు ఆ అధికారి ఏకంగా నిబంధనలే మార్చివేశారని తెలంగాణ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పటినుంచో సబ్స్టేషన్ల నిర్వహణ చేపడుతున్న కంపెనీలను కాదని, పూర్తిగా కొత్త నిబంధనలతో.. టెండర్ నియమాలకు సంబంధించిన జీవోకు విరుద్ధంగా టెండర్లు పిలిచారని, ఈనెల 30న వాటిని ఖరారు చేయాల్సి ఉండగా టెండర్ నిబంధనలు జీవోకు విరుద్ధంగా ఉన్నాయంటూ తెలంగాణకు చెందిన ఓ కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లడంతో తాత్కాలికంగా ప్రక్రియ నిలిచిపోయింది.
మిషన్ భగీరథ పంప్‌హౌస్‌లకు సరఫరా అయ్యే విద్యుత్తు సబ్స్టేషన్ల ఎనిమిది నెలల నిర్వహణ కోసం ఇటీవల ఆర్డబ్ల్యూఎస్ అధికారులు టెండర్లు పిలిచారు. భువనగిరి, దేవరకొండ, గద్వాల, కరీంనగర్ ఎల్ఎండీ, వనపర్తి, జూరాల తదితర మొత్తం 36 సబ్స్టేషన్ల నిర్వహణ కోసం రూ.10 కోట్ల నుంచి 12 కోట్ల అంచనాతో వేర్వేరుగా టెండర్లు పిలిచారు. వీటికి సంబంధించి మిషన్ భగీరథలో ఓ అధికారి టెండర్ నిబంధనలు రూపొందించారు. కాగా గతంలో ఉన్న నిబంధనలను తుంగలో తొక్కి తాను జట్టుకట్టిన సంస్థకే టెండర్లు కట్టబెట్టేందుకు ఆ సంస్థకు ఉన్న అర్హతలను బట్టి నిబంధనలు రూపొందించినట్టుగా తెలంగాణ కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీవో 94 ద్వారా లైసెన్స్ పొందిన సంస్థలకే ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థల్లో టెండర్ పద్ధతిన విద్యుత్తు కాంట్రాక్టు పనులు చేసేందుకు అర్హత ఉంటుంది. కానీ భువనగిరిలోని ఒక ఆర్డబ్ల్యూఎస్ అధికారి టెండర్లకు సంబంధించిన నిబంధనలనే మార్చేశారని తెలంగాణ కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
జీవో 94 ప్రకారం టెండర్లలో పాల్గొనే అర్హతలు ఉన్న వారిని కాదని తమ సొంతవారికి ఈ టెండర్ల్లు కట్టబెట్టేందుకు జీవోకు విరుద్ధంగా పలు రూల్స్ మార్చేశారని కాంట్రాక్టర్లు చెప్పారు. మిషన్ భగీరథ సబ్స్టేషన్ల నిర్వహణ టెండర్ నిబంధనల మేరకు అందులో పాల్గొనే ఏజెన్సీకి తప్పనిసరిగా సొంత రిపేరింగ్ వర్క్‌షాప్ ఉండాలని పేర్కొన్నారు. తప్పనిసరిగా ఫిల్టరేషన్ మిషిన్ వంటి సొంత మిషనరీతో పాటు వీసీబీ, ఓఎల్టీసీ రిపేర్, మెయింటెనెన్స్ వంటివి ఉండాలని చెప్పారు. సొంత వర్క్‌షాప్ ఉన్న కాంట్రాక్టర్లు తెలంగాణలో లేరని, అంతేకాకుండా మిషనరీ కూడా అద్దెకు తెచ్చుకుని వినియోగించి తిరిగి వెనక్కు పంపడం తప్ప సొంతంగా ఎవరూ కొనుక్కోరని ఇదంతా ఒక ఆంధ్రాప్రాంత కంపెనీ కోసమేనని తెలంగాణ కాంట్రాక్టర్లు చెప్పారు. ఆర్అండ్బీ లైసెన్స్ ఉన్నవారికి ప్రభుత్వ పరంగా జరిగే పనుల్లో ఏ టెండర్‌లోనైనా పాల్గొనే అర్హత ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో లైసెన్స్ కలిగిన సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనడానికి అర్హులుగా పేర్కొంటూ నిబంధనలు రూపొందించారని, ఒక సంస్థ వెండర్ లైసెన్స్ ఉన్నవారు మరోసంస్థ టెండర్లలో పాల్గొనలేరని, ప్రభుత్వపరమైన పనులకు సంబంధించి ఏ పని చేయాలన్నా జీవో 94 ప్రకారం నిబంధనలు ఉండాల్సింది పోయి అందుకు విరుద్ధంగా కొత్త నిబంధనలు రూపొందించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వారికి లేబర్ లైసెన్స్‌లు, పీఎఫ్ రిజిస్ట్రేషన్, మిషన్ భగీరథలో పనులు చేయడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్నవారిని కాదని, జీవో 94కి విరుద్ధంగా ఈ టెండర్ నిబంధనలు రూపొందించారంటూ బోడుప్పల్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి వారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వంతో సహా మిషన్ భగీరథ ఈఎన్సీ తదితరులను కోర్టు ఆదేశించింది. దీంతో నిబంధనలను మార్పు చేసి ఈ తలనొప్పి ఎందుకు తెచ్చిపెట్టావంటూ మిషన్ భగీరథ ఈఎన్సీతో సహా పలువురు ఉన్నతాధికారులు ఆ అధికారిపై మండిపడుతున్నట్టు సమాచారం.
కన్నెపల్లి, జూలై 30 : కరెంట్ కోతలపై రైతులు కన్నెర్ర చేశారు. వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కన్నెపల్లి సబ్‌స్టేషన్ ఎదుట మాడవెల్లి, ఐతపల్లి, కన్నెపల్లి రైతులు బుధవారం ధర్నాచేశారు. తరచుగా కరెంటు పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వ్యవసాయ బోర్లు రిపేర్ అవుతున్నాయని, ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కన్నెపల్లి ఎస్ఐ భాస్కర్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ ఏఈ నర్సింహులుతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం విద్యుత్తు శాఖ అధికారులకు వినతిపత్రం అందించారు.