రంగారెడ్డి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ)/కందుకూరు: కాంగ్రెస్ సర్కారుపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫ్యూచర్‌సిటీ ముసుగులో మరో 15వేల ఎకరాలు, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పేరిట 1,000 ఎకరాలను తీసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి సబితాఇంద్రారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. ఫ్యూచర్‌సిటీ, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. 330 ఫీట్ల వెడల్పుతో వేసిన రోడ్డుతో భూములు కోల్పోతున్న రైతులకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని తెలిపారు. తమ అనుకూల వ్యక్తుల ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేయిస్తున్నారని సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఒప్పించి, తగిన పరిహారం ఇచ్చి, ఫార్మాసిటీ కోసం భూమి సేకరించిందని తెలిపారు. అధికారంలోకి వస్తే యాచారం మండలం కుర్మిద్ద, తాటిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లి గ్రామాల్లో సుమారు 2,500 ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ భూములను రైతులకు ఇవ్వకపోగా, బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని సబితాఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు.
రంగారెడ్డి జిల్లాను లూటీ చేస్తున్నారు: జైపాల్‌యాదవ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్‌ను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆరోపించారు. మొండిగౌరెల్లిలో పరిశ్రమల పేరుతో యాచారం, కందుకూరు మండలాల్లో ఫ్యూచర్‌సిటీ పేరుతో, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, ఆమనగల్లు, మహేశ్వరం మండలాల్లో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పేరుతో రైతుల భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు భూసేకరణ పేరుతో రంగారెడ్డి జిల్లాను లూటీచేసేందుకు ప్రయత్నిస్తున్నారని జైపాల్‌యాదవ్ విమర్శించారు. జిల్లా ప్రజలకు, రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని ఫ్యూచర్‌సిటీతో పాటు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును రద్దుచేయాలని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథనాయక్, బీఆర్ఎస్ కందుకూరు మండల అధ్యక్షుడు జయందర్, కందుకూరు సింగిల్‌విండో చైర్మన్ శేఖర్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు దీక్షిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
ఈ నెల 27న హనుమకొండ ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సబితాఇంద్రారెడ్డి ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులంతా తమ ఇంటి పండుగగా ముందుకువచ్చి, సభను విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ బహిరంగసభ ద్వారా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరముందని తెలిపారు.