బూర్గంపాడు, జూలై 28: అప్పుల బాధ తాళలేక, వాటిని తీర్చే మార్గం కనిపించక ఓ యువ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర గ్రామంలో చోటుచేసుకుంది. బంజర గ్రామానికి చెందిన నలుగూరి రామిరెడ్డి (35) రెండేండ్ల క్రితం రూ.12 లక్షలతో గ్రామంలో ఎకరం పొలాన్ని కొనుగోలు చేశాడు. అందుకు కొంత అప్పు తెచ్చాడు. దానికితోడు ఆ పొలం పక్కనే మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఆ మొత్తం పొలంలో వరి పంటను సాగుచేస్తున్నాడు.
పొలం కొనుగోలు చేసినందుకు అయిన అప్పుతోపాటు కౌలుకు తీసుకున్న పొలంలో పంటను సాగు చేసేందుకు కూడా మరికొంత అప్పు చేశాడు. ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో అప్పుల బాధలు ఎక్కువై మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం తన భార్య వరలక్ష్మి వరి నాట్లు వేసేందుకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి వివరాలు సేకరించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబీకులు తెలిపారు.