భూత్పూర్, ఏప్రిల్ 8 : విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. భూత్పూరు మండలం భట్టుపల్లికి చెందిన తిరుమలయ్య (50) అదే గ్రామంలో గోపాల్గౌడ్కు చెందిన రెండున్నర ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వరి సాగుచేశాడు.
పంటకు నీళ్లు పారించేందుకు మంగళవారం రాత్రి పొలం వద్దకు వెళ్లాడు. బోరుమోటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. తిరుమలయ్య ఎంతకూ ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లిచూడగా విగతజీవిగా కనిపించాడు. తిరుమలయ్యకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.