కొత్తగూడెం ప్రగతి మైదాన్, సెప్టెంబర్ 11: మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకరపోరులో పది మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. ప్రాథమిక వివరాలను రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా వెల్లడించారు. గరియాబంద్ జిల్లా మైన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధి భాలూ డిగ్గి సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసు అధికారులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.
దీంతో కోబ్రా, గరియాబంద్ జిల్లాకు చెందిన ఈ-30, స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్) భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య భీకరపోరు సాగింది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు.
అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు వారికి సంబంధించిన ఆయుధ, వస్తు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, మృతిచెందిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ అలియాస్ భాస్కర్‌తోపాటు ఒడిశా రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు(ఎస్‌జెడ్‌సీఎం) ప్రమోద్ అలియాస్ పాండు మృతిచెందినట్లుగా పోలీస్ అధికారులు తెలిపారు.