నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై నందిపాడు సమీపంలో అదుపుతప్పిన కావేరీ ట్రావెల్స్ బస్సు (Travels Bus) రోడ్డు పక్కనున్న రాళ్ల గుట్టను ఢీకొట్టింది. దీంతో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు. బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్కు వస్తున్నదని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారని చెప్పారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.