హైదరాబాద్. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యే లు కాంగ్రెస్‌లో చేరిన విషయం బహిరంగ రహస్యమని
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ( MLA Palla Rajeshwar Reddy ) అన్నారు. అసెంబ్లీ హాల్ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు( BRS MLAs) ఇచ్చిన ఫిర్యాదుతో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చారని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ విచారణ చేపట్టారని,ఫిరాయింపు ఎమ్మెల్యేల తరుఫున వచ్చిన అడ్వకేట్లు తిమ్మిని బమ్మి చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. అసంబద్ధ ప్రశ్నలు వేశారని, అయినా ఓపిక తో సమాధానం చెప్పామని వెల్లడించారు.
నిస్సుగ్గుగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరలేదని చెప్తున్నారని విమర్శించారు. పార్టీ మారి అధికారాన్ని అనుభవిస్తున్నారని, వారిని డిస్క్వాలిఫై చేయాలని స్పష్టంగా చెప్పామని తెలిపారు. తమ అడ్వకేట్ లు ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారని అన్నారు.ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.