రాజన్న సిరిసిల్ల నమస్తే తెలంగాణ, అక్టోబర్ 22: వేములవాడ(Vemulawada) రాజన్న దర్శనాలను ఆలయ అధికారులు బుధవారం నిలిపివేశారు. కార్తీక మాసం కావడంతో రాజన్న సన్నిధికి మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే ఉదయం నుండి స్వామివారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో తలనీలాలు సమర్పించుకొని దర్శనానికి రాగా బంద్ చేసినట్లుగా భద్రతా సిబ్బంది వెల్లడించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి వచ్చామని భక్తులు వెల్లడించారు.
ఉదయం స్వామివారికి అభిషేకం చేసుకునే భక్తులకు మాత్రం అనుమతినివ్వగా భక్తుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆలయంలో రేకుల షెడ్డు తొలగించే పనుల్లో భాగంగా బంద్ చేసినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రచార సాధనాలు పెరిగాయని, ముందస్తు సమాచారం ఇచ్చి ఆలయాన్ని మూసివేస్తే బాగుంటుంది కదా అని భక్తుల అభిప్రాయపడ్డారు. ఒక్కసారిగా భక్తులు ఉత్తర ద్వారం వద్ద చేరుకొని ఉన్న కాస్త భక్తులైన దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను ప్రాధేయపడ్డారు.
అధికారుల ఆదేశాల మేరకే భక్తులను నిలిపివేశామని భద్రత సిబ్బంది వెల్లడించడంతో గంటల తరబడి భక్తులు అవకాశం కోసం ఎదురు చూశారు. ఇక చేసేదేమీ లేక కొందరు భక్తులు బయట నుండే స్వామి వారికి దండం పెట్టి వెను తిరిగారు. మరోవైపు ఆలయంలో భక్తుల దర్శనాల నిలిపివేతపై స్పష్టమైన ప్రకటన ఇప్పటివరకు అధికారికంగా ఇవ్వకపోగా, గందరగోళాల మధ్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.