Summer | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): వేసవి ప్రారంభమైందో లేదో అప్పుడే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వడగాలులు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఏప్రిల్ రెండోవారం, మే నెలలోనే ఇంతలా ఎండ తీవ్రతలను చూస్తుంటాం.
కానీ ఈ ఏడాది కాస్త ముందే ఎండలు మండిపోతున్నాయి. ఇండస్ట్రీయల్ ఏరియాలో ఎండ మరీ ఎక్కువగా ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఏపీలోనూ మార్చి నుంచే తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎండలపై సమాచారం కోసం విపత్తు నిర్వహణ సంస్థ 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటుచేశారు.