Summer | హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉక్కపోతతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూగజీవాలు సైతం ఈ వేడిమిని తట్టుకోలేక విలవిలలాడిపోతున్నాయి.
పొద్దున 8 గంటల నుంచే ఎండ దంచికొడుతోంది. ఇవాళ హైదరాబాద్, రాజమండ్రిల్లో రికార్డుస్థాయిలో 49 డిగ్రీలు, ఏలూరులో 48 డిగ్రీలు, కొత్తగూడెం, మిర్యాలగూడలో 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మిగతా ప్రాంతాల్లోనూ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
వడదెబ్బకు తెలంగాణలో ముగ్గురు, ఏపీలో ఇద్దరు మృతి చెందారు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు చల్లని ప్రదేశాల్లో ఉండాలని సూచిస్తున్నారు. వడదెబ్బకు గురి కాకుండా మజ్జిగ, ఓఆర్ఎస్ లాంటి ద్రావాణాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.