హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంపై చలిపులి పంజా విసురుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఒక్కోసారి 7, 8 డిగ్రీలకు కూడా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదయం వేళ అనేక ప్రాంతాల్లో మంచు కురవడం వల్ల గడిచిన మూడ్రోజుల్లో ఉష్ణోగ్రతలు క్షీణించాయి. రాత్రివేళల్లో, ముఖ్యంగా తెల్లవారుజామున చలి తీవ్రత అధికంగా ఉంటున్నది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గురువారం నుంచి ఒకటి రెండు రోజులు అదనంగా రెండు, మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని, నెల అంతా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో పరిస్థితి మరింత సంక్షిష్టంగా ఉంటుందని భావిస్తున్నారు. దేశంపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉంటున్నది. ఈశాన్య గాలులకు తోడు వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కూడా తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఒకేసారి పడిపోవడానికి కారణమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణలో గతేడాది నవంబర్ 11న 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం మినహా మిగిలిన 30 జిల్లాల్లో 8.5 నుంచి 12.7 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. నిరుడుతో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగానే నమోదవుతున్నా.. రానున్న రోజుల్లో మరింత తక్కువగా రికార్డయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అంచనా వేస్తున్నది.
నెలాఖరు దాకా తక్కువ ఉష్ణోగ్రతలే
రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదయ్యాయి. అల్పపీడనం ప్రభావంతో ఒకటి, రెండు రోజులు ఉష్ణోగ్రతలు అదనంగా రెండు, మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. కానీ, నవంబర్ నెల అంతా అతి తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నది. డిసెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు ఏవిధంగా నమోదవుతాయన్నది ఆ నెల మొదటి వారంలో తెలుస్తుంది.
– నాగరత్న, హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్