హైదరాబాద్ : బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రంలో డిసెంబర్ 4న తుఫాను ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో డిసెంబర్ 5న నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది డిసెంబర్ 7వ తేదీ ఉదయం నాటికి పశ్చిమ వాయవ్యంగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు చుట్టూ పక్కల ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఉదయాన్నే దట్టమైన పొగ మంచు కట్టేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 10-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. రాబోయే ఐదురోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, పొగమంచు సంభవించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితలంపై దక్షిణం నుంచి తూర్పు దిశగా వేగంగా గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుందని తెలిపింది.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలుగా ఉండే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్‌లో 13.7 డిగ్రీలు, భద్రాచలం 22 డిగ్రీలు, దుండిగల్ 18.7 డిగ్రీలు, హకీంపేట 18.1 డిగ్రీలు, హనుమకొండ 19 డిగ్రీలు, హైదరాబాద్ 18.4 డిగ్రీలు, ఖమ్మం 20 డిగ్రీలు, మహబూబ్‌నగర్ 21 డిగ్రీలు, మెదక్ 16.6 డిగ్రీలు, నల్లగొండ 19 డిగ్రీలు, నిజామాబాద్ 17.6 డిగ్రీలు, రామగుండం 17.5 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల ఐదు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది.