హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఎథిక్స్ కమిటీ పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని ఎథిక్స్ కమిటీ మెంబర్, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారంలో తొందరెందుకు?, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు దానం, మందుల సామేలు, వీర్లపల్లి శంకర్‌పై చర్యల విషయంలో జాప్యమెందుకు? అని సూటిగా ప్రశ్నించారు.
అధికారపార్టీ సభ్యులకు ఒక న్యాయం, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులకు మరొకటా అని నిలదీశారు. అసెంబ్లీలోని ఎథిక్స్ కమిటీ ఆఫీసులో బుధవారం నిర్వహించిన ఎథిక్స్ కమిటీ సమావేశానికి వేముల హాజరయ్యారు. అనంతరం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఎథిక్స్ కమిటీ సమావేశంలో లెవనెత్తిన అంశాలను ప్రస్తావించారు. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవడంలో కనబరుస్తున్న ఉత్సాహం అధికారపార్టీ సభ్యుల విషయంలో చూపడం లేదెందుకని ప్రశ్నించానని పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డిపై మూడు నెలల్లో కఠిన చర్యలు తీసుకోవాలనే నిబంధన ఎక్కడా లేదనే విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అవసరమైతే విచారణను పొడిగించవచ్చనే అంశాన్ని నొక్కి చెప్పానని తెలిపారు.
అలాగే గతంలో అధికార పార్టీ సభ్యులపై ఇచ్చిన ఫిర్యాదుల విషయంలో తాత్సారం చేయడంలోని ఆంతర్యమేందని ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. నాటి శాసనసభ పూర్తి వీడియో ఫుటేజీ ఇచ్చిన తర్వాతే కౌశిక్‌రెడ్డి వివరణ ఇస్తారనే అంశాన్ని సమావేశంలో ప్రస్తావించినట్టు చెప్పారు. గతంలో కేవలం కౌశిక్‌రెడ్డికి సంబంధించిన వీడియోనే చూపడాన్ని తప్పుపట్టినట్టు పేర్కొన్నారు. పూర్తి వీడియో ఇవ్వకుండా వివరణ అడుగడం నైతిక విలువలకు విరుద్ధమనే విషయాన్ని ఎథిక్స్ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. ఇప్పటికైనా నిష్పక్షపాతంగా విచారణ చేయాలని పునరుద్ఘాటించారు. తాను లెవనెత్తిన అంశాలకు పలువురు ఇతరపక్షాల సభ్యులు సైతం మద్దతిచ్చినట్టు వెల్లడించారు.
ఎథిక్స్ కమిటీలో వాడీవేడిగా చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. కౌశిక్‌రెడ్డి ఘటనకు సంబంధించి ఆ రోజు పూర్తి వీడియో ఇవ్వాలని పట్టుబట్టినట్టు సమాచారం. అయితే ఇందుకు చైర్మన్ అంగీకరించలేదని, మొత్తం వీడియో కాకుండా కడియం శ్రీహరి మాట్లాడినప్పటి నుంచి వీడియో ఫుటేజీ ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకొనే అంశంపై ఈ నెల 30న మరోసారి ఎథిక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.