సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నిమ్స్ ప్రతిష్టకే మచ్చగా మిగిలిపోయిన అక్రమార్కుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డా.లక్ష్మీభాస్కర్ అక్రమాల చిట్టాపై ఏసీబీ సహా ఇంటలిజెన్స్, విజిలెన్స్ వర్గాలు ఆరాతీస్తున్నాయి. ముఖ్యంగా డా.లక్ష్మీ భాస్కర్ అక్రమాలకు సహకరించిన కీలక అధికారి ఎవరు అనే దానిపై దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టినట్లు సమాచారం. ఈ మేరకు నిందితుడి ద్వారా సేకరించిన సమాచారం మేరకు కొందరు పదవీ విరమణ చేసిన అధికారులు, సిబ్బందితో పాటు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ముగ్గురు అధికారులు, ఇద్దరు సిబ్బందిపై నిఘా వర్గాలు కూపీ లాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిమ్స్‌లో జరిగిన ఔట్ సోర్సింగ్ నియామకాలు, మందుల కొనుగోలు, వైద్యపరికరాల కొనుగోళ్లలో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా దర్యాప్తు సంస్థలు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా అత్యవసర విభాగానికి సంబంధించిన మందుల కొనుగోలులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా దవాఖానలోని డైట్, పార్కింగ్, శానిటేషన్, క్యాంటీన్, సెక్యూరిటీ, తదితర కాంట్రాక్టర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ఏదేని నియామకాలు జరగాలన్నా లేదా మందులు కొనుగోలు చేయాలన్నా, వైద్యపరికరాలు కొనుగోలు చేయాలన్నా కీలక అధికారుల ఆమోదం తప్పనిసరి. వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే నియామకాలు, పదోన్నతులు, మందుల కొనుగోళ్ల వ్యవహారం వంటివి సాధ్యమవుతాయి. అయితే సదరు అధికారి నలుగురు డైరెక్టర్ల ఆధ్వర్యంలో కీలక బాధ్యతలు వహించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు తెలిసింది.
ఈ కీలక అధికారుల్లో ఏ అధికారి డా.లక్ష్మీభాస్కర్‌కు సహకరించారనే దానిపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు ఆరాతీస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా డా.భాస్కర్‌కు సహకరించిన వారిలో కొందరు పదవీ విరమణ పొందిన వారు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించి వారి వివరాలు కూడా సేకరిస్తున్నట్లు తెలిసిందే. వీరితో పాటు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ముగ్గురు అధికారులు, ఇద్దరు సిబ్బంది వివరాలతో పాటు వారి అక్రమార్జన, ఆస్తుల చిట్టాపై దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా నిందితుడితో అంటకాగి, పెద్ద ఎత్తున పైరవీలు, అక్రమార్జనకు పాల్పడిన ముగ్గురు మీడియా ప్రతినిధులపై సైతం నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా అధికారుల విచారణలో నిందితుడు తమ పేర్లను ఎక్కడ వెల్లడించాడోనని కొందరు సిబ్బంది, అధికారుల గుండెల్లో రైలు పరుగెడుతోంది.
ఓ మంత్రి పేషీలో వసూళ్ల ‘రాజ్’గా పేరున్న ఒక వ్యక్తితో పాటు సదరు మంత్రి పీఏ అండదండలతో కూడా నిందారోపణలు ఎదుర్కొంటున్న అధికారి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలపై సైతం అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అయితే సదరు మంత్రి పిఏ, వసూళ్లరాజ్పై దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటాయా అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.