హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్నది. ఉదయం 8 గంటలకే ఇంటినుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత, హనుమకొండ జిల్లా ధర్మసాగర్, కరీంనగర్ జిల్లా చొప్పదండి, పెద్దపల్లి జిల్లా ఓదెలలో 46.4 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జనగామ, ఖమ్మం, జగిత్యాల, నల్లగొండ, సిద్దిపేట, మంచిర్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 17 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న 4 రోజులు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: సీఎం
రాష్ట్రంలో తీవ్ర వడగాలులు, ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎకువగా ఉండే ప్రమాదమున్నదని, ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించారు. తాగునీరు, విద్యుత్తు సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని సీఎస్ రామకృష్ణారావును సీఎం రేవంత్ ఆదేశించారు.
బాందా@ 48.2 డిగ్రీల సెల్సియస్ ; దేశంలో అత్యధిక వేడి ప్రాంతంగా నమోదు
దేశవ్యాప్తంగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ బాందా జిల్లా దేశంలోనే అత్యంత వేడి ప్రాంతంగా రికార్డ్ నెలకొల్పింది. మంగళవారం ఇక్కడి ఉష్ణోగ్రతలు ఏకంగా 48.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవటంతో జిల్లా అంతటా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. ఏప్రిల్ నుంచి ఇక్కడ తీవ్రమైన వేడి వాతావరణం నెలకొంటున్నది. దీంతో జిల్లా ్ల అంతటా ఉదయం 10 గంటలకే దుకాణ సముదాయాలు, కార్యాలయాలు మూసివేస్తున్నారు. జనం వీధుల్లోకి వచ్చే పరిస్థితులు లేకపోవటంతో.. అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తున్నది. ఒకప్పుడు రాజస్థాన్‌లోని చురు, జైసల్మేర్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు యూపీలోని బాందా జిల్లాను దేశంలో అత్యంత వేడి ప్రాంతంగా నిలబెట్టాయి. తీవ్రమైన ఎండల కారణంగా స్థానికుల దినచర్య పూర్తిగా మారిపోయింది. వ్యాపారులు ఉదయం 6 గంటలకు పనులు ప్రారంభించి, ఉదయం 10 గంటలకల్లా ఇండ్లకు చేరుకుంటున్నారు. ఈ పరిస్థితులు తట్టుకోలేక రైతులు రాత్రివేళల్లో ఎల్ఈడీ బల్బుల వెలుతురులో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. గత కొన్నేండ్లుగా జిల్లాలో అడవుల విస్తీర్ణం తగ్గిపోవటం, పర్వతాల్లో ఇష్టానుసారంగా సాగుతున్న మైనింగ్, భారీ పేలుళ్లు, పచ్చదనం కోల్పోవటం.. వెరసి తీవ్రమైన ఉష్ణ్రోగ్రతులు ఏర్పడటానికి దారితీసిందని నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు
జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రత