ఖమ్మం, మార్చి 16 : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరిచిందని ఖమ్మానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు మండిపడ్డారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలు గు విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్ నేత గీతారెడ్డి మాతృమూర్తి ఈశ్వరీబాయి పేరు పెట్టేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఆక్షేపణీయమైనవని పేర్కొన్నా రు. ఖమ్మంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆదివారం జరిగిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా, నగర కమిటీ సమావేశంలో సంఘం నేతలు మాట్లాడారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తించిన గత ప్రభుత్వాలు.. వర్సిటీకి ఉన్న ఆయన పేరును తొలగించేందుకే ఏనాడూ ప్రయత్నించలేదని గుర్తుచేశారు. అమరజీవి పేరు మార్చే ప్రయత్నం చేస్తే తెలుగు రాష్ర్టాల్లోని ఆర్యవైశ్యుల ఆగ్రహాన్ని చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): భాగస్వామ్య పింఛను పథకం (సీపీఎస్) రద్దు కావాలని ఎల్లమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేసినట్టు నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్వోపీఆర్యూఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మాచన రఘునందన్ తెలిపారు. బలంపేట ఎల్లమ్మతల్లి ఆలయంలో సీపీఎస్ రద్దు కోరుతూ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనిఫైడ్ పెన్షన్ సీమ్ రద్దు కోసం ఈనెల 23న చలో ఢిల్లీ కార్యక్రమం తలపెట్టామని, అది విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నామని వెల్లడించారు. కేంద్రంలోని పాలకులు ఎప్పటికప్పుడు సీపీఎస్ రద్దు చేస్తామని పబ్బం గడుపుతున్నారే తప్ప.. పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ స్కీం పునరుద్ధరించేలా పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఆలయాల్లో పూజలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంగ చంద్రకళ, వల్లకాటి నారాయణ, మోర మౌనిక, దాసరి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.