హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : ఏపీ, తెలంగాణ రాష్ర్టాలను ప్రస్తుతం మద్యం మాఫియా నడిపిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్‌గౌడ్, ఉపేంద్రతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. డిస్టిలరీ సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గబోమని ప్రకటించి, ఇప్పుడు బీర్ల రేట్లు పెంచడం ఏమిటని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నామమాత్రంగా ధరలు పెంచితే గగ్గోలు పెట్టి ఇప్పుడు బీరుకు ఏకంగా రూ.30 నుంచి రూ.40 పెంచారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో బ్రాందీ, విస్కీ రేట్లను సైతం భారీగా పెంచుతారని ఆందోళన వ్యక్తంచేశారు. నాణ్యతలేని బీర్లను సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాలతో పాలకులు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఒక్కటై ఈ బీర్ల ధరలు పెంచాయా? అన్న అనుమానం కలుగుతున్నదని, రెండుచోట్ల ఒకేసారి ధరలు పెంచడంతో రెండు రాష్ర్టాల మధ్య ఒప్పందం ఉండొచ్చని విమర్శించారు. బెల్ట్‌షాపులను బంద్ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముంగిట ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. హోంగార్డులకు వేతనాలు పెంచి నాడు కేసీఆర్ వారి గౌరవం పెంచారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు హోంగార్డులకు జీతాలే ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హోంగార్డులు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. హోంగార్డుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా త్వరలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపడతామని శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు.
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 12: కేసీఆర్ దేశంలోనే గొప్ప నాయకుడని, రాష్ర్టా న్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ పేర్కొన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో కేసీఆర్ క్రికెట్ కప్- 2025 టోర్నీని బుధవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని, వరంగల్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చారన్నారు. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని వినయ్‌భాసర్ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.