Krishna Water | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లన్నీ ఖాళీ అయ్యేంతవరకూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన రేవంత్‌రెడ్డి సర్కారు.. ఇప్పుడు టెలిమెట్రీల ఏర్పాటుకు పట్టుబడుతున్నామంటూ హడావుడి చేస్తున్నది. నీళ్లను ఒడిసిపట్టే పనులపై దృష్టిపెటకుండా, ఏపీకి విడిచిపెట్టి ఇప్పుడు చిందులు వేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లే విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి కేఆర్ఎంబీ మొదటి విడతగా నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ కలుపుకుని మొత్తంగా 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటుచేసింది. కానీ, వాటిని ఇప్పటివరకు అధికారికంగా అమల్లోకి తీసుకురాలేదు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీపై ఏర్పాటుచేసిన టెలిమెట్రీలు పనిచేయకుండా పోయాయి. ఇదేమని కేఆర్ఎంబీ అడగగా పిచ్చుకలు వాటిని ధ్వంసం చేసినట్టు ఏపీ గతంలో వెల్లడించడం గమనార్హం. అయితే, ఏపీనే ట్యాంపరింగ్ చేసిందని కేఆర్‌ఎంబీతోపాటు కేంద్రానికి సైతం అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసిన కేఆర్ఎంబీ గతంలోనే అధ్యయనం చేయించింది. టెలిమెట్రీల వ్యవస్థ ఏమాత్రం సవ్యంగా లేదని ఆ కమిటీ స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడు దిగువన 600 మీటర్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన టెలిమెట్రీలను 12.26 కిలోమీటర్ వద్దకు మార్చారని, ఆ పాయింట్ సరికాదని, అక్కడ అమర్చిన నాన్ కాంటాక్ట్ రాడార్ వెలాసిటీ సెన్సర్ కూడా అంత అనువైనది కాదని స్పష్టంచేసింది. నాగార్జునసాగర్, శ్రీశైలం వద్ద తప్ప మిగిలిన టెలిమెట్రీలు కచ్చితమైన నీటిప్రవాహ సామర్థ్యాన్ని సూచించడం లేదని తెలిపింది. అనువైన ప్రాంతాల్లో, అనువైన సెన్సార్లను ఏర్పాటుచేయాలని కేఆర్ఎంబీకి సిఫారసు చేసింది.
టెలిమెట్రీలు లేకపోవడంతో ఇప్పటికీ మాన్యువల్‌గానే డిశ్చార్జి కెపాసిటీని సేకరిస్తున్నారు. రెండవ దశలో టెలిమెట్రీలను ఏర్పాటుచేసే సమయంలోనే మొదటి దశలో ఏర్పాటుచేసిన టెలిమెట్రీల సెన్సార్లను కచ్చితమైన నీటి లెక్కలను గణించేందుకు అనువైన ప్రాంతాలకు మార్చాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. అయితే, నిధులు లేవని చెప్తూ ఏపీ ఎప్పటికప్పుడు దాటవేస్తున్నది. ఈ నేపథ్యంలో టెలిమెట్రీలు అందుబాటులోకి వచ్చే వరకూ ఇరు రాష్ర్టాల అధికారుల ఆధ్వర్యంలోని జాయింట్ ఇన్స్పెక్షన్ బృందాలు లెక్కగట్టిన నీటి గణాంకాలనే అధికారికంగా పరిగణనలోకి తీసుకోవాలని 9వ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. నాటి నుంచీ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ అందజేస్తున్న గణాంకాలను ఎప్పటికప్పుడు కేఆర్ఎంబీ వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు.
రెండోదశ కోసం సర్కారు హడావుడి
నీటి వినియోగం, నిల్వ సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టకుండా తెలంగాణ సర్కారు ఇప్పుడు 2వ దశ టెలిమెట్రీల ఏర్పాటుకు పట్టుబడుతుండటంపై తెలంగాణ నీటిరంగ నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఖర్చును ఏపీ చెల్లించకపోయినా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందంటూ ప్రకటనలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు సంబంధించి పలు ఔట్లెట్లపై ఫేజ్-2 కింద మిగతా తొమ్మిదిచోట్ల టెలిమెట్రీలను ఏర్పాటుచేయాలని 18వ బోర్డు సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారే టెలిమెట్రీల ఏర్పాటుకు కోసం మొత్తం నిధులను విడుదల చేస్తామని, ఏపీ నుంచి తరువాత వసూలు చేసుకుంటామని వెల్లడించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ సైతం రూ.7 కోట్ల నిధులను విడుదల చేయాలని ఇరు రాష్ర్టాలకు లేఖ రాసింది. లేఖ రాసిన రెండు రోజుల వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వం రూ.4.15 కోట్లు విడుదల చేసింది. అయితే, టెలిమెట్రీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామంటూ కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతుండటంపై తెలంగాణ నీటిరంగ నిపుణులు, ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. టెలిమెట్రీలను ఏర్పాటుచేసి లెక్కలు తీసుకోవడం తప్ప చేసేదేముందని ప్రశ్నిస్తున్నారు. నీటిని తరలించుకునే సామర్థ్యం, నిల్వచేసుకునే సామర్థ్యం ఉన్న నేపథ్యంలోనే ఏపీ సర్కారు ఇష్టారీతిన కృష్ణాజలాలను కొల్లగొడుతున్నదని, ఆ అవకాశం లేకపోవడం వల్లే తెలంగాణ తన వాటాను వినియోగించుకోలేకపోతున్నదని వివరిస్తున్నారు.
ఏమాత్రం సోయి ఉన్నా ఏపీ తరహాలోనే నీటి నిల్వ సామర్థ్యం, వినియోగ సామర్థ్యాన్ని అత్యంత వేగంగా పెంచుకోవాలని, తద్వారానే ఏపీ జలదోపిడీని అడ్డుకట్ట వేయవచ్చని చెప్తున్నారు. టెలిమెట్రీల ఏర్పాటు ద్వారా లెక్కలు తీయడం, ఫిర్యాదులు చేయడం తప్ప తెలంగాణకు ఒరిగేదేమీ ఉండబోదని వివరిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన కొద్దిపాటి పనులను పూర్తి చేసి ఉంటే నీటి తరలింపు, స్టోరేజీ సామర్థ్యం పెరిగి ఉండేదని గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకుండా టెలిమెట్రీల ఏర్పాటు వెనక పరుగులు తీయడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
సర్కారు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే..
కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల్లో 1010పైగా టీఎంసీలు ఈ ఏడాది వినియోగానికి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఏపీ ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తున్నా, తెలంగాణ సర్కారు మాత్రం చోద్యం చూస్తూ వచ్చింది. కృష్ణా బోర్డుపై ఒత్తిడి పెంచకుండా, త్రిసభ్య కమిటీ సమావేశానికి డిమాండ్ చేయకుండా మౌనం వహించింది. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ఈ ఏడాది ఇప్పటికే 76 శాతానికిపైగా జలాలను ఏపీ కొల్లగొట్టింది. ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, దిగువ నాగార్జునసాగర్ కుడి కాలువ, పవర్‌హౌజ్ స్లూయిస్ల ద్వారా దాదాపు 450కుపైగా టీఎంసీల జలాలను తన్నుకుపోయింది. తెలంగాణ మాత్రం తన తాత్కాలిక వాటా 34% కంటే, తక్కువగా 24% జలాలను మాత్రమే వినియోగించుకున్నది. ఇప్పటికే నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లన్నీ డెడ్‌స్టోరేజీకి చేరువయ్యాయి. మరోవైపు, ఎడమ కాలువ కింద పంటలు ఎండిపోతుండటమే కాకుండా, హైదరాబాద్ తాగునీటి సరఫరా కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయమై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, ఆయకట్టు రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రైతాంగం రోడ్లమీదకు వచ్చి సాగు, తాగునీటి కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ పెద్దలు ఎదురు దాడికి దిగుతున్నారు.
మొదటి దశలో టెలిమెట్రీలు ఏర్పాటుచేసిన ప్రాజెక్టుల ఔట్లెట్లు
ఎమ్మార్పీ లిఫ్ట్, నాగార్జునసాగర్ డ్యామ్ డైవర్షన్ టన్నెల్, ఎన్ఎస్పీ హెడ్‌రెగ్యులేటరీ, ఎన్ఎస్పీ లెఫ్ట్‌కెనాల్ టన్నెల్, పాలేరు రిజర్వాయర్ ఎగువన ఎంట్రీ పాయింట్, పాలేరు రిజర్వాయర్ దిగువన, ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్ 101.36 కి.మీ వద్ద, కల్వకుర్తి సిస్టర్న్, శ్రీశైలం రిజర్వాయర్ 17/18 బ్లాక్, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ 12.265 కి.మీ వద్ద, హెచ్ఎన్ఎస్ఎస్ పంప్‌హౌజ్, జూరాల ప్రాజెక్టు, జూరాల రైట్ మెయిన్ కెనాల్ హెడ్‌రెగ్యులేటరీ, జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్ హెడ్‌రెగ్యులేటరీ, జూరాల లెఫ్ట్ ప్యార్లల్ కెనాల్ హెడ్‌రెగ్యులేటరీ, భీమా లిఫ్ట్-1 స్కీమ్, నెట్టెంపాడు లిఫ్ట్ స్కీమ్, కోయిల్‌సాగర్ లిఫ్ట్ స్కీమ్
ప్రస్తుతం రెండవ దశలో ఏర్పాటు చేయాల్సిన ఔట్లెట్లు
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ వద్ద శ్రీశైలం కుడి ప్రధాన కాలువపై, నాగార్జునసాగర్ కుడి కాలువ, సాగర్ ఎడమ కాలువ, పాలేరు రిజర్వాయర్ ఎగువన ఎడమ కాలువపై 136.35 కి.మీ వద్ద, సాగర్ ఎడమ కాలువ 101.36 కి.మీ ఏపీ బార్డర్ వద్ద, పోలవరం కెనాల్, ప్రకాశం బరాజ్ పశ్చిమ కాలువపై, ప్రకాశం బరాజ్ తూర్పూ ప్రధాన కాలువపై, కర్నూలు-కడప (కేసీ) కెనాల్.