KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): స్టార్టప్‌లకు ప్రోత్సాహం, ఆవిష్కరణల్లో టీహబ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నదని, గొప్ప విజయాలు సాధిస్తూ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మారుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జరిగిన టీ హబ్ ఇన్నోవేషన్ సమ్మిట్ రెండవ ఎడిషన్ (గ్లాడియేటర్స్ ఆఫ్ ది మైండ్) కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్రం లో స్టార్టప్ ఎకో సిస్టంను రూపొందించటంలో, తెలంగాణను పారిశ్రామికవేత్తల గమ్యస్థానంగా ఉంచటంలో టీహబ్ ఎంతో చేస్తున్నదని కొనియాడారు. స్టార్టప్‌లకు ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ స్థానాన్ని పటిష్ఠం చేస్తున్నదని అభినందించారు. టీహబ్.. ఇన్నోవేషన్ హబ్‌గా అవతరించినందుకు గర్వంగా ఉన్నదని, రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ అత్యంత వేగం గా అభివృద్ధి చెందుతున్నదని, సుస్థిర ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం వల్లే సాధ్యమవుతున్నదని వెల్లడించారు. ఈ సదస్సుకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడినంతసేపు నవ్వులతో పాటు చప్పుట్లు మోగాయి. అచ్చ తెలుగులో మాట్లాడిన ఆయన మాటలతో అందర్నీ నవ్వించారు. నేటి తరం వారంతా టెక్నాలజీతో అద్భుతాలు చేస్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో హైదరాబాద్ ఎంతో ఎత్తుకు ఎదిగిందని చెప్పారు.
మల్లారెడ్డి మాట్లాడాక కేటీఆర్ మాట్లాడారు. ‘మంత్రి మల్లారెడ్డి మాట్లాడాక నేను మాట్లాడటం అంటే కొద్దిగా ప్రాబ్లమే. తెలంగాణ భాషలో చెప్పాలంటే యాట కూర తిన్నంక.. తోట కూర తిన్నట్టు ఉంటది. ైస్టెలిష్‌గా చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేశాక, వేరొకరు స్లో బ్యాటింగ్ చేసినట్టు ఉంటది. మల్లారెడ్డితో మేం మ్యాచ్ కాలేం. మీరు(మల్లారెడ్డి) సోషల్ మీడియా స్టార్’ అని కేటీఆర్ అనటంతో సమావేశ మందిరమంతా నవ్వులు పూశాయి. ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ నుంచి ఇతర రాష్ర్టాలు ఎంతో నేర్చుకునేలా సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని, టెక్నాలజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసేలా మంత్రి కేటీఆర్ టీహబ్‌కు బలమైన పునాది వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేటి శాస్త్రవేత్తలు పాలియోఆంత్రపాలజిస్ట్ లూయిస్ లీకీ, న్యూరో సైంటిస్ట్ అనిల్ సేథ్, గణిత శాస్త్రజ్ఞుడు సర్ మార్కస్ డు సౌటోయ్, ప్రముఖ భారతీయ రచయిత మహ్మద్ ఫారూఖీ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు, సైయెంట్ చైర్మన్ బీవీ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రతి రంగానికి ప్రాధాన్యమిస్తూ సరికొత్త పాలసీలు తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన రియల్ ఎస్టేట్ అవా ర్డు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఎస్‌బీపాస్ పేరుతో భవన నిర్మాణ రంగానికి ప్రభుత్వం అత్యుత్తమ పాలసీ తీసుకొచ్చిందని, దాంతో నిర్మాణరంగంలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తున్నదని వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులతో పెట్టుబడులు రాష్ర్టానికి తరలి వస్తున్నాయని పేర్కొన్నారు.