హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకొంటున్నది. 14 కీలకమైన రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం నుంచి తీవ్ర సహాయ నిరాకరణ ఎదురవుతున్నది. వివిధ ప్రాంతాలనుంచి జిల్లా కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి రాజధాని నగరానికి కలిపే రోడ్లతోపాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఇండస్ట్రియల్ కారిడార్లు, పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అంతర్రాష్ట్ర కనెక్టివిటీకి ఉపయోగపడే రోడ్లను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ దాదాపు 8 ఏండ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధంచేసింది. వీటిని కేంద్ర ప్రభుత్వానికి పంపినా ఇంతవరకూ అక్కడినుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ మధ్యలో అధికారులు అనేకసార్లు కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు లేఖలు రాసినా ఫలితం లేదు. చౌటుప్పల్-సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయాలని గతంలోనే ఆర్అండ్బీ శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, 2016లో ఆమోదముద్ర వేసింది. అనంతరం అధికారులు రోడ్డు అలైన్మెంట్, రోడ్డు సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖకు పంపించారు. అయినా ఇంతవరకూ తుది అనుమతులు మంజూరు చేయలేదు.
165 కిలోమీటర్ల పొడవైన కరీంనగర్-పిట్లం రోడ్డుకు 2016లో కేంద్రం ప్రాథమిక అనుమతులు మంజూరు చేసినప్పటికీ ఇంతవరకు తుది అనుమతులు రాలేదు. వనపర్తి-మంత్రాలయంవరకు 110 కిలోమీటర్ల రోడ్డు ప్రతిపాదనలను 2017 నుంచి కేంద్రం నాన్చుతూనే ఉన్నది. 133.9 కిలోమీటర్ల మన్నెగూడ-జహీరాబాద్ రోడ్డు ప్రతిపాదన 2015 నుంచి కేంద్రం వద్ద పెండింగులో ఉన్నది. నారాయణపేట జిల్లా కేంద్రాన్ని జాతీయ రహదారితో కలిపే 63 కిలోమీటర్ల అతి కీలక మరికల్-రామసముద్ర రోడ్డు, పెద్దపల్లి జిల్లా కేంద్రంతో రామప్ప టెంపుల్ను కలిపే 164 కిలోమీటర్ల జగిత్యాల-జంగాలపల్లి రోడ్డు, యాదాద్రి, కొల్లాపూర్, వేములవాడ, భూత్పూర్ తదితర ప్రాంతాల్లోని ఆలయాలను కలిపే రోడ్లు, కరీంనగర్-రాయపట్నం, జగ్గయ్యపేట-కొత్తగూడెం ఎకనామిక్ కారిడార్లు, అంతర్రాష్ట్ర రోడ్ల కనెక్టివిటీ తదితర రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా కేంద్రం 8 ఏండ్లుగా నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నది. చౌటుప్పల్ (ఎన్హెచ్-65)-ఆమన్గల్-షాద్నగర్-సంగారెడ్డి (ఎన్హెచ్-65) వరకు 182 కిలోమీటర్ల రోడ్డుతోపాటు కరీంనగర్ (జంక్షన్ ఎన్హెచ్-563)-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం (జంక్షన్ ఎన్హెచ్-161)వరకు 165 కిలోమీటర్ల రోడ్డుకు ప్రాథమిక అనుమతులు లభించి ఏడేండ్లు గడిచినా ఇంతవరకూ తుది అనుమతులు రాలేదు. అలాగే, మిగిలిన 12 రోడ్లకు కేంద్రం రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారం 8 ఏండ్ల క్రితం ప్రతిపాదనలు పంపినా ఉలుకూ పలుకూ లేదు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వంతోపాటు ఆర్అండ్బీ అధికారులు అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అన్ని నిబంధనలు పాటిస్తూ నివేదికలు పంపినా కేంద్ర సర్కారు తెలంగాణ రోడ్లకు అనుమతులు ఇవ్వకపోవడం గమనార్హం. అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్న రాష్ట్రంపై వివక్షకు ఇదే నిదర్శనం.