కాంగ్రెస్ సర్కార్ చేతిలోపడి, తెలంగాణ ఆర్థికం ఆగమవుతున్నది. కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు క్రమంగా దిగజారిపోతున్నది. కేంద్ర ప్రభుత్వ అర్థ్ధగణాంక శాఖ విడుదల చేసిన తాజా నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టంచేశాయి. తలసరి ఆదాయంలో రాష్ట్రం ర్యాంక్ రెండోస్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ పాలనలో రాష్ర్టానికి పెట్టుబడుల రాక తగ్గిపోవడం, నిరుద్యోగిత పెరిగిపోవడమే తలసరి ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓ వ్యక్తి చాలా కష్టపడి పునాది నుంచి మొదలుపెట్టి, ఇటుక ఇటుక పేర్చి, ఇంటిని అందంగా కట్టుకున్నాడు. అతని తర్వాత యజమానిగా మారిన మరో వ్యక్తి వీలైతే ఆ ఇంటిని మరింత అభివృద్ధి చేయాలి. అదీ చేతగాకపోతే కనీసం చెడగొట్టకుండా అయినా కాపాడుకోవాలి. కానీ అలా జరుగలేదు. ఇంటిని బాగుచేయడం మానేసిన ఆ కొత్త యజమాని ఇంటి పునాదులే కదిలిపోయేలా నష్టం కలిగిస్తున్నాడు. అలాంటి యజమానిని ఏమనాలి? ప్రస్తుతం తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన కూడా ఇలాగే తయారైంది. కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు క్రమంగా దిగజారిపోతున్నది. కేంద్రప్రభుత్వ తాజా గణాంకాల్లో ఇదే విషయం తేటతెల్లమైంది.
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిన తెలంగాణ.. ఇప్పుడు ఆ రికార్డును కోల్పోయింది. కేసీఆర్ పాలనలో పర్ క్యాపిటా ఇండెక్స్‌లో (తలసరి ఆదాయ సూచీలో) అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు రెండోస్థానానికి పడిపోయింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (ఎంవోఎస్పీఐ) తాజా అంచనాల ప్రకారం.. తలసరి ఆదాయంలో రూ.4,33,326తో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా, రూ.4,18,931తో తెలంగాణ రెండో స్థానానికే పరిమితమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12.22 శాతం వృద్ధిరేటుతో తలసరిలో కర్ణాటక నంబర్‌వన్ స్థానానికి వెళ్లగా, ఇదే సమయంలో తెలంగాణ 10.24 శాతం వృద్ధిరేటునే నమోదు చేసినట్టు ఎంవోఎస్పీఐ గణాంకాలు వెల్లడించాయి. తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ ర్యాంకును కోల్పోవడం ఇదే తొలిసారి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో సగటున ఒక్కో పౌరుడు సంపాదించే మొత్తాన్ని తలసరి ఆదాయంగా పరిగణిస్తారు. తలసరి వృద్ధిరేటును ఒక దేశం లేదా రాష్ట్ర అభివృద్ధి వేగానికి నిదర్శనంగా భావిస్తారు. ఈ రెండు అంశాల్లో జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే.. తెలంగాణ గతంలో ఎంతో ఎత్తులో ఉండేది. కేసీఆర్ హయాంలో తొమ్మిదిన్నరేండ్లలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో పౌరుల తలసరి ఆదాయం రాకెట్ వేగంతో దూసుకుపోయిందనేది అక్షర సత్యం. ఇప్పుడు ఆ వేగానికి రేవంత్ సర్కార్ బ్రేకులు వేసినట్టు తాజా గణాంకాలే చెప్తున్నాయి. కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయంలో సగటున 15.34 శాతం వృద్ధిరేటు నమోదైతే, కాంగ్రెస్ పాలనలో ఇది కేవలం 10.24 శాతానికే పరిమితమైనట్టు తాజాగా తేలింది. ఈ కారణంతోనే తెలంగాణను దాటేసి తలసరిలో కర్ణాటక టాప్ స్థానానికి చేరుకొన్నట్టు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర తలసరి ఆదాయంలో వృద్ధిరేటు మందగించడానికి పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. రేవంత్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన హైడ్రా వంటి నిర్ణయాలు, కబ్జాల ఆరోపణలతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా కుదేలైనట్టు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో లోపాలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లిందని, ఈ కారణాలతోనే రాష్ర్టానికి పెట్టుబడులు రాలేదని చెప్తున్నారు. కొత్త కంపెనీలు రాకపోవడం, ఉపాధి అవకాశాలు మందగించడంతో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు ఆకాశానికి అంటినట్టు గుర్తుచేస్తున్నారు. సాగు ఉత్పత్తులకు మద్దతు ధర లేకపోవడం, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడం వెరసి పౌరుల తలసరి ఆదాయంలో క్షీణతకు ప్రధాన కారణాలుగా మారినట్టు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ పాలనలో రాష్ట్రంలో డిఫ్లెషన్ (ప్రతి ద్రవ్యోల్బణం) పలుమార్లు నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ తలసిరుల సవ్వడులు దేశవ్యాప్తంగా మార్మోగాయి. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104గా నమోదైంది. అలా ఏటికేడు పెరుగుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సగటున 15.34 శాతం వృద్ధిరేటు నమోదై తెలంగాణ తలసరి ఆదాయం 3,47,714కు ఎగబాకింది. ఇదే సమయంలో దేశ తలసరి వృద్ధిరేటు 10 శాతానికే పరిమితమైంది. అంతేకాదు, కేసీఆర్ పాలనలో తెలంగాణ తలసరి ఆదాయం.. దేశంలోనే పెద్ద రాష్ర్టాలుగా చెప్పుకొనే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, కర్ణాటక తదితర 13 రాష్ర్టాలకంటే ఎక్కువగా ఉండేది. అప్పుడు దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణలోని 30 జిల్లాల తలసరి ఆదాయం ఎంతో ఎక్కువగా ఉండేది. కానీ, రేవంత్ ఈ రెండున్నరేండ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం అంతకంతకూ పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
