హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాగునీటి రంగం ఏపీ అధికారుల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయింది. శాఖలోని కీలక స్థానాలన్నీ ఆంధ్రా క్యాడర్ అధికారులతో నిండిపోతున్నాయి. ఒకరిద్దరు తెలంగాణ అధికారులను కీలక స్థానాల్లో కూర్చోబెట్టినా.. అధికారాలేవీ ఇవ్వకుండా, సొంత నిర్ణయాలను తీసుకోనివ్వకుండా చక్రబంధనాలు బిగించారు. ఇతర సీనియర్ తెలంగాణ అధికారులపై వివిధ నెపాలు, సాకులు చూపుతూ పక్కకు నెడుతున్నారు. కీలక స్థానాల్లో పాగా వేసిన ఏపీకి చెందిన అధికారులు తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు సాగకుండా కొర్రీలతో అడ్డుకుంటున్నారు. ఏపీ అధికారుల నియామకాల వెనుక ఆంధ్రాకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. ఆయన ఎవరి పేరు చెప్తే వారికి పోస్టులు కట్టబెడుతున్న దుస్థితి నెలకొన్నది. దీంతో తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు తీరని నష్టం వాటిల్లే ప్ర మాదం నెలకొన్నది. గుట్టుచప్పుడు కాకుండా బనకచర్ల అంశంలో ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న దుస్థితి. ఇంత జరుగుతున్నా అమాత్యుడు చూసీచూడనట్టుగా వ్యవహరించడం, సదరు ఏపీ క్యాడర్ అధికారులను ప్రోత్సహించడం జలసౌధ, ఇం జినీర్ల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ సలహాదారుడి (ఇరిగేషన్ శాఖ)గా విశ్రాంత ఐఏఎస్ ఆదిత్యనాథ్‌దాస్ నియామకంతో తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఏపీ గుత్తాధిపత్యంలోకి వెళ్లడం ప్రారంభమైంది. దాస్ రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి అలాటయ్యారు. తొలుత చంద్రబాబు హయాంలో ఐదేండ్లు, ఆ తరువాత జగన్మోహన్రెడ్డి హయాంలోనూ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగారు. గడచిన పదేండ్లపాటు ఏపీ ప్రభుత్వ సేవలోనే ఉన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ప్రభుత్వం తరపున శక్తికి మించి కృషిచేశారు. తెలంగాణకు గొడ్డలిపెట్టుగా మారిన రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడంలో కీలకంగా పనిచేశారు. అలాంటి వ్యక్తిని ప్రభుత్వ సలహదారుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించి ఆదిలోనే ఇరిగేషన్ శాఖను ఏపీకి తాకట్టు పెట్టేందుకు పునాదులు వేసింది. సెక్రటేరియట్ స్థాయిలో అత్యంత కీలకమైన మరో పోస్టు జాయింట్ సెక్రటరీ (టెక్నికల్). రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతీ ఫైలు జేఎస్ నుంచే ప్రభుత్వానికి చేరుతుంది. ఈ పదవిలోనూ ఏపీకి అలాటైన అధికారినే సర్కారు నియమించింది. మంత్రికి సంబంధించి ఓఎస్డీగా ఏపీకి చెందిన అధికారే నియమితులయ్యారు. ఇరిగేషన్ శాఖలో ఈఎన్సీ జనరల్ తరువాత అత్యంత కీలకమైన స్థానం అడ్మినిస్ట్రేషన్. ఆ పోస్టును సైతం ఏపీ అధికారితోనే భర్తీ చేశారు. ఈయన బాధ్యతలను చేపట్టిన తరువాత సెక్రటేరియట్‌తోపాటు ఇరిగేషన్ శాఖలో కీలకమైన టెక్నికల్ సెక్షన్, అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్, కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ తదితర దిగువస్థాయి డీఈఈ పోస్టుల్లోనూ ఏపీ అధికారులతోనే భర్తీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సీఈ పరిధిలోని మరో కీలకమైన స్థానంలోనూ ఏపీ అధికారిని నియమించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జలసౌధవర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖను ఏపీకి చెందిన అధికారులే శాసిస్తున్నారని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.
కీలక స్థానాలను ఆక్రమించిన ఏపీకి చెం దిన ఇంజినీర్లు.. ఒక ప్రణాళిక ప్రకారం తెలంగాణ ఇంజినీర్లను పక్కకు నెట్టడుతున్నారని జలసౌధవర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సైతం ఏపీ అధికారులకు కలిసివస్తున్నదని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విజిలెన్స్, ఘోష్ కమిషన్‌పై కాంగ్రెస్ ప్రభు త్వం హడావుడి చేయడం, రాజకీయంగా వినియోగించుకోవడాన్ని అదునుగా చేసుకుని ఏపీ అధికారులు ఇప్పుడు ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్నారని రాష్ట్ర ఇంజినీర్లు వాపోతున్నారు. ఆ నివేదికలను సాకుగా చూపుతూ సీనియర్ తెలంగాణ ఇంజినీర్లను తప్పించారని తెలుస్తున్నది. ఘోష్ కమిషన్ నివేదిక తదితర సాకులు చూపుతూ ఇరిగేషన్ శాఖ అడ్మిన్‌గా, జనరల్‌గా విధులను నిర్వర్తించిన ఈఎన్సీ అనిల్‌కుమార్‌ను సెక్రటేరియట్‌కు నాలుగు నెలల క్రితం అటాచ్ చేశారు. ఈ నెలాఖరున ఆయన రిటైర్ కానున్నారు. ఇప్పటికీ అనిల్‌కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. అదేవిధంగా అవినీతి ఆరోపణల పేరు చెప్తూ హైదరాబాద్ సీఈ ఈఎన్సీ జనరల్‌కు అటాచ్ చేసినా ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు.
ఖమ్మం సీఈని సైతం అక్కడినుంచి పక్కకు తప్పించారు. వీరితోపాటు కీలకస్థానాల్లో ఉన్న పలువురు ఎస్ఈలు, ఈఈలను అదే తరహాలో తప్పించారు. మరోవైపు, అదేవిధమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరికి మాత్రం కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో తెలంగాణ సీనియర్ ఇంజినీర్లను కీలకస్థానాల్లో లేకుండా చేయడమే అసలు ఉద్దేశమని తేటతెల్లమవుతున్నది. ప్రమోషన్లు వచ్చే అవకాశం లేకున్నా ఇదే తరహాలో కొందరిని తప్పించి, అదనపు బాధ్యతలు అప్పగించి అనుయాయులైన ఏపీ అధికారులను కీలకస్థానాల్లో కూర్చోబెట్టారని జలసౌధవర్గాలు వివరిస్తున్నాయి. పేరుకే కొందరు తెలంగాణ ఇంజినీర్లకు బాధ్యతలు అప్పగించారని, అయితే వారు సొం తంగా నిర్ణయాలు తీసుకోకుండా ఎక్కిడికక్కడ చక్రబంధనాలు బిగించారని మండిపడుతున్నారు. ఆయా బాధ్యతలు చేపట్టిన సదరు ఇంజినీర్లు సైతం సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని చెప్పుకుంటూ ఆవేదన చెందుతున్నా రు. సీనియర్ ఇంజినీర్లను పక్కకు నెడుతుండటం ఒకటైతే, ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న తమను సైతం వేధింపులకు గురిచేస్తున్నారని సీనియర్ తెలంగాణ ఇంజినీర్లు వాపోతున్నారు. తమపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టడంతోపాటు మీడియాతో మాట్లాడొద్దని, సమాచారమేదీ ఇవ్వొద్దంటూ ఆంక్షలు విధిస్తున్నారని చెప్తున్నారు.
కీలక స్థానాల్లో పాగా వేసిన ఏపీకి చెందిన ఇంజినీర్లు సాకేంతిక అంశాలను సాకుగా చూపుతూ తెలంగాణకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందు పడకుండా అడ్డుకుంటున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం సదరు అధికారులేనని తెలుస్తున్నది. ప్రాజెక్టు రివైజ్డ్ అంచనాలు ఇవ్వకుండా దాదాపు ఏడాదిపాటు నిలువరించారు. సీతారామ ప్రాజెక్టుదీ అదే దుస్థితి. దేవాదుల, చనాక-కొరటా ప్రాజెక్టుల ఆర్ఈలు ఇప్పటికీ ఆమోదానికి నోచుకోలేదు. తెలంగాణ ప్రభు త్వం చిన్నకాళేశ్వరం, రాజీవ్‌భీమా, నారాయణపేట-కొడంగల్, ఎస్ఎల్బీసీ తదితర ప్రాజెక్టులను ప్రాధాన్యం అంశంగా తీసుకున్నది. ఆ ప్రాజెక్టులు సైతం పురోగతికి నోచుకోలేని దుస్థితి నెలకొన్నది. ఇందుకు కారణం కీలకస్థానాల్లో పాగా వేసిన ఏపీ అధికారేలేనని ఇంజినీర్లు వివరిస్తున్నారు. సాధారణంగా ప్రాజెక్టులకు సంబంధించి పనులు, ఇతరత్రా అంశాలపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో అన్ని ప్రాజెక్టుల ఈఎన్సీలు, సీఈలు ఉంటారు. ఎస్ఎల్ఎస్సీ ఆమోదం తెలిపి, ప్రభుత్వానికి సిఫారసు చేసిన ప్రాజెక్టుల ఫైల్స్‌పై సైతం కీలక స్థానాల్లోని ఏపీ అధికారులు కొర్రీలు వేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులే కాదు ప్రభుత్వం, టెరిటోరియల్ వారీగా సీఈలు తీసుకునే ప్రతీ అంశంపై ఒకదాని తరువాత ఒకటి పేచీలు పెడుతూ మూలకు నెడుతున్నారని ఇంజినీర్లు వాపోతున్నారు. గత 22నెలలుగా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు పడకపోవడం ఇంజినీర్ల వాదనలకు బలం చేకూర్చుతున్నది.
తెలంగాణ ప్రాజెక్టులు మూలకు పడుతుండటం ఒకటైతే, రాష్ట్ర జలహక్కులకు సైతం ఏపీకి చెందిన ఇంజినీర్లు తీవ్ర విఘాతం కల్పిస్తున్నారని సెక్రటేరియట్ వర్గాలు, తెలంగాణ సీనియర్ ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వరద జలాల మా టున బనకచర్ల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని విఘాతమని తెలంగాణవాదులే కాదు, ప్రభుత్వ పెద్దలు సైతం పలుమార్లు పేర్కొన్నారు. అయినప్పటికీ, ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ పాల్గొనేలా, బనకచర్లపై చర్చల కోసం కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడంలోనూ ఏపీకి చెందిన ఇదే అధికారులు కీలకభూమిక పోషించినట్టు తెలిసింది. అమాత్యుడికే తెలియకుండా కమిటీకి పలువురి పేర్లను సిఫారసు చేయడం, తుదకు వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనలు మూలకుపడ్డాయి. ఏపీ సర్కారు చేపట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో ఎకనామికల్ అప్రైజల్ ప్రక్రియ ఆగబోదని కేంద్ర జల్‌శక్తి శాఖ చెప్పకనే చెప్పింది. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్వయంగా 20 రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పటికీ బయటకు పొక్కకుండా సదరు ఏపీ అధికారులే కీలకపాత్ర పోషించారని తెలుస్తున్నది. ట్రిబ్యునల్ ఎదుట కృష్ణాజలాల పంపిణీపై కొనసాగుతున్న వాదనలకు సంబంధించిన కీలక సమాచారం సైతం ముందస్తుగానే ఏపీకి చేరుతున్నదని రాష్ట్ర ఇంజినీర్లు చెప్తున్నారు. కీలక స్థానాల్లోని ఏపీ అధికారుల వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నదని రాష్ట్ర ఇంజినీర్లు సర్కారును హెచ్చరిస్తున్నారు.
జాతీయ కాంగ్రెస్ అధినేత అనుచరుడిగా పేరున్న కీలక నేత ఒకరు ఇరిగేషన్ శాఖలోకి ఆంధ్ర అధికారులను చొప్పిస్తున్నారని జలసౌధ వర్గాలు చెప్తున్నాయి. నీటి పారుదల శాఖ అత్యున్నత అధికారి మొదలు, సలహాదారుని వరకూ ప్రతి భర్తీ సదరు ఢిల్లీ నాయకుడు సిఫారసు చేసినవేననే ప్రచారం జరుగుతున్నది. సదరు నేత కన్నుగీటితేనే జలవనరుల శాఖలో ఫైళ్లు కదులుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సదరు నాయకుడు పంపిన దూతే అమాత్యుని వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నట్టు తెలిసింది. సదరు నాయకుడి బంధువులు, అత్యంత సన్నిహితులకు కీలక స్థానాలను కట్టబెట్టారని తెలుస్తున్నది. పార్టీ, రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యనేత మౌనంగా ఉంటున్నారని, తన పనులకు ఆటంకం లేకుండా ఆయన ఏ పని చెప్పినా చేయాలని ముఖ్యనేతే ఆదేశాలిచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ర్టానికి వెన్నెముక లాంటి ఇరిగేషన్ శాఖలోకి ఆంధ్ర అధికారులు దూరడం తెలంగాణ ప్రయోజనాలకు తీరని విఘాతమని రా్రష్ట్ర ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.