2023-24 కేసీఆర్ హయాంలో జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ ర్యాంక్ 3
14 2024-25 రేవంత్ ప్రభుత్వంలో జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ ర్యాంక్
15 నెలల్లో జీఎస్డీపీ వృద్ధిరేటు పతనం.. 11 ర్యాంకులు
1 2023-24 కేసీఆర్ హయాంలో తలసరి వృద్ధిరేటులో ర్యాంక్
2024-25 రేవంత్ ప్రభుత్వంలో తలసరి వృద్ధిరేటులో ర్యాంక్ 11
15 నెలల్లో తలసరి వృద్ధిరేటులో పతనం ..10 ర్యాంకులు
పదకొండేండ్ల కింద ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు తెలంగాణ ఆర్థికంగా బలహీనంగా ఉండేది. తెలంగాణలో సమ్మిళితాభివృద్ధే లక్ష్యంగా అప్పటి సీఎం కేసీఆర్ పదేండ్లు శ్రమించి రాష్ర్టానికి బలమైన ఆర్థిక పునాదులు వేశారు. ఆర్థికంగా పసికూనగా ఉన్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టారు. దాని ఫలితంగానే జీఎస్డీపీ, తలసరి ఆదాయం, జీఎస్టీ వసూళ్లు, రవాణా రాబడిలో దేశంలోనే రాష్ట్రం టాప్ ర్యాంకులో నిలిచింది.
ఎవరో శాపం పెట్టినట్టు.. అన్ని ఆర్థిక సూచీల్లో తెలంగాణ అధఃపాతాళానికి దిగజారింది. జీఎస్డీపీ, తలసరి ఆదాయం, జీఎస్టీ వసూళ్లు, రవాణా రాబడి ఇలా ఏ అంశాన్ని విశ్లేషించినా రాష్ట్రం ఇప్పుడు పేలవమైన ప్రదర్శననే కనబర్చింది. కాంగ్రెస్ వచ్చిన 15 నెలల్లోనే తెలంగాణ ఆర్థికం అధోగతి పాలైంది.
ఎంతలో ఎంత తేడా? ఎట్లుండె తెలంగాణ.. ఎట్లయిపాయే?? పదకొండేండ్ల కింద ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు తెలంగాణ ఆర్థికంగా బలహీనంగా ఉండేది. అయితే తెలంగాణలో సమ్మిళితాభివృద్ధే లక్ష్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లపాటు శ్రమించి రాష్ర్టానికి బలమైన ఆర్థిక పునాదులు వేశారు. ఆర్థికంగా పసికూనగా ఉన్న రాష్ర్టాన్ని అన్ని విషయాల్లో అగ్రగామిగా నిలబెట్టారు. దాని ఫలితమే జీఎస్డీపీ, తలసరి ఆదాయం, జీఎస్టీ వసూళ్లు, రవాణా రాబడి ఇలా ప్రతి విషయంలోనూ తెలంగాణ దేశంలోనే టాప్ ర్యాంకులో నిలిచింది.
అయితే ఎవరో శాపం పెట్టినట్టు.. ఉన్నట్టుండి పిడుగు పడినట్టు దాదాపు అన్ని ఆర్థిక సూచీల్లో తెలంగాణ అధఃపాతాళానికి దిగజారిపోయింది. జీఎస్డీపీ, తలసరి, జీఎస్టీ వసూళ్లు, రవాణా రాబడి ఇలా ఏ అంశాన్ని విశ్లేషించినా రాష్ట్రం ఇప్పుడు పేలవమైన ప్రదర్శననే కనబర్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే తెలంగాణ ఆర్థికం అధోగతి పాలయ్యిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంటిని రక్షించే ఓ స్తంభంలా రాష్ర్టాన్ని కాపాడి తెలంగాణకు కేసీఆర్ వేసిన బలమైన ఆర్థిక పునాదులను రేవంత్ ప్రభుత్వం నాశనం చేసిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): కేసీఆర్ జమానాలో ఆర్థిక రంగంలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించింది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. జీఎస్డీపీ వృద్ధిరేటులో మిగతా రాష్ర్టాలకు దిక్సూచిగా మారింది. అయితే, ఇదంతా గతం. 15 నెలల రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థికం అతలాకుతలమైంది. ఎంతలా అంటే.. అస్సాం, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్ వంటి చిన్న రాష్ర్టాలతో పోలిస్తే ఒకప్పటి సిరుల తెలంగాణ ఇప్పుడు ఎంతో వెనుకంజలో నిలబడింది. రేవంత్ పాలనలో జీఎస్డీపీ వృద్ధిరేటు పరంగా తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. అలాగే తలసరి ఆదాయం వృద్ధిరేటులో 11వ స్థానానికి పరిమితమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వృద్ధి రేట్లపై కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్పీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి.
ఒక రాష్ట్రంలోని మొత్తం పౌరుల ఉత్పాదకతను స్థూలంగా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)గా పిలుస్తారు. తెలంగాణ ఆవిర్భావమప్పుడు 2014-15లో జీఎస్డీపీ రూ. 5.05 లక్షల కోట్లుగా నమోదైంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగేనాటికి అంటే 2023-24లో జీఎస్డీపీ రూ. 15,01,981కోట్లకు చేరింది. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ జీఎస్డీపీ దాదాపు రూ. 10 లక్షల కోట్ల మేర పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ జీఎస్డీపీ రూ. 16.12 లక్షల కోట్లకు చేరింది. అయితే కేసీఆర్ పాలనతో పోలిస్తే, జీఎస్డీపీ వృద్ధిరేటు రేవంత్ పాలనలో తగ్గుముఖం పట్టినట్టు ఎంవోఎస్పీఐ గణాంకాలను బట్టి అర్థమవుతున్నది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జీఎస్డీపీలో 11.06 శాతం మేర వృద్ధిరేటును నమోదు చేసిన తెలంగాణ.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 10.12 శాతానికే (ప్రస్తుత ధరలు) పరిమితమైంది. దీంతో జీఎస్డీపీ వృద్ధిరేటులో కేసీఆర్ హయాంలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్న తెలంగాణ.. ప్రస్తుతం 14వ స్థానానికి పడిపోయింది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చిన్న రాష్ర్టాలు అస్సాం, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్‌తో పోలిస్తే జీఎస్డీపీ వృద్ధి రేటులో తెలంగాణ ర్యాంకు తక్కువగా ఉన్నది. స్థిర ధరల వద్ద కూడా జీఎస్డీపీ వృద్ధి రేటులో (6.79 శాతం) తెలంగాణ 13వ స్థానానికి పరిమితమైంది. ఈ మేరకు ఎంవోఎస్పీఐ నివేదిక ద్వారా అర్థమవుతున్నది.
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు అక్కడి పౌరుల తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొంటారు. రాష్ట్రంలో సగటున ఒక్కో పౌరుడు సంపాదించే మొత్తాన్ని తలసరి ఆదాయంగా పిలుస్తారు. తలసరి ఆదాయంలో వృద్ధిరేటును ఒక దేశం లేదా రాష్ట్ర అభివృద్ధి వేగానికి నిదర్శనంగా భావించొచ్చు. కేసీఆర్ ప్రభుత్వహయాంలో గడిచిన పదేండ్లలో తెలంగాణ తలసరి ఆదాయంలో రాకెట్ వేగంతో దూసుకుపోయింది. అయితే, తలసరి ఆదాయం విషయంలో కేసీఆర్ హయాంలో నమోదైన రికార్డులు.. రేవంత్ 15 నెలల పాలనలో తగ్గుముఖం పట్టినట్టు ఎంవోఎస్పీఐ గణాంకాలను బట్టి అర్థమవుతున్నది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయంలో 14.1 శాతం మేర వృద్ధిరేటును నమోదు చేసిన తెలంగాణ.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 9.6 శాతానికే (ప్రస్తుత ధరలు) పరిమితమైంది. దీంతో తలసరి ఆదాయ వృద్ధిరేటులో కేసీఆర్ హయాంలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిన తెలంగాణ.. ప్రస్తుతం 11వ స్థానానికి పడిపోయింది. కల్లోలిత కశ్మీర్, అస్సాం వంటి చిన్న రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ తలసరి వృద్ధి రేటు తక్కువగా ఉండటం గమనార్హం. ఈ మేరకు ఎంవోఎస్పీఐ గణాంకాలను బట్టి తెలుస్తున్నది.
రాష్ట్ర రవాణాశాఖలో గతంతో పోల్చితే ఈసారి భారీగా వసూళ్లు తగ్గాయి. కరోనా కాలంలో 2020-21 తర్వాత.. మళ్లీ భారీగా తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. 2023-2024లో రవాణాశాఖలో రూ.6,690.22 కోట్ల ఆదాయం రాగా.. 2024-25 సంవత్సరానికి కేవలం రూ.5,787.96 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. గతంతో పోల్చితే రూ.1,203 కోట్లకు ట్రాన్స్పోర్ట్ శాఖలో రెవెన్యూ వసూళ్లు తగ్గాయి. రాష్ట్ర రవాణా శాఖలో లైసెన్స్ ఉన్న డ్రైవర్ల నుంచి పన్నులు వసూలు చేయడం, వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు జారీ చేయడం, పన్ను వసూళ్లు చేయడం, వాహనాల ఉల్లంఘనలను నియంత్రించడానికి ఫైన్లు వేయడం వంటి వాటితో ఆదాయం భారీగా సమకూరుతుంది. అయితే, తెలంగాణలో 1.72 కోట్ల వాహనాలు రిజిస్టరై ఉండగా.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రవాణాశాఖ ద్వారా 2025 జనవరి వరకూ రూ.5,787.96 కోట్ల మొత్తాన్ని మాత్రమే వసూలు చేశారు.
రాష్ట్ర జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు మార్చిలో సున్నాకు పడిపోయింది. అవును ఇది నిజం. రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు మార్చి నెలలో రూ.5,401 కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు మార్చితో పోల్చితే ఒక శాతం కూడా పెరుగలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు వృద్ధి రేటు 9.9 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు 5.5 శాతానికే పరిమితమైంది. అంటే కేంద్రం నమోదు చేసిన వృద్ధిరేటులో రాష్ట్ర వృద్ధిరేటు దాదాపు సగంగా నమోదైంది. బీఆర్ఎస్ పాలనలో ప్రతియేటా పెరిగిన జీఎస్టీ రాబడి.. కాంగ్రెస్ పాలనలో స్తంభించిపోయింది. ఈ నెల ఒకటో తేదీన జీఎస్టీ వసూళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాంప్, రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోవడంతోపాటు జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల మందగించిందని ఆర్థిక నిఫుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ ప్రజల చేతుల్లో డబ్బులు లేక క్రయ, విక్రయాల్లో ఎలాంటి పెరుగుదల లేనట్టుగా చెప్తున్నారు.
రాష్ట్ర జీఎస్టీ వసూళ్లపై ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సైతం అబద్ధాలు చెప్పారు. తాజా బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు 12.3 శాతంగా ఉన్నదని వెల్లడించారు. రాష్ర్టానికి అంత రాబడి లేదని, జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు 5.5 శాతానికే పరిమితమవుతుందని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే ఆర్థికశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన గణాంకాల్లో తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు 5.1 శాతం పరిమితం కావడంతో అసెంబ్లీ సాక్షిగా భట్టి అబద్ధాలు చెప్పినట్టు నిరూపితమైంది.