Vizag Steel Plant | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం నాడు తెలంగాణ గర్జించింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు, నిరసనల్లో తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. తూటాలకు బలయ్యారు. నేడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం తెలంగాణ నడుంబిగించింది. విశాఖ ఉక్కు తుక్కుకాకుండా సింహనాదం చేస్తున్నది. విశాఖ ఉక్కును తుక్కుగా మార్చిన కేంద్రం పాత ఇనుపరాతి విధానాలపై ఉద్యమగడ్డ గర్జిస్తున్నది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీ నిర్వహణకు కావాల్సిన నిధులు ఇచ్చి, ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ ఉక్కు ఉద్యమంతో తెలంగాణకు ఏండ్లనాటి అనుబంధం ఉన్నది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణది మొదటినుంచీ పెద్దన్న పాత్ర. 1960లోనే హైదరాబాద్ నడిగడ్డమీద విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కోసం విద్యార్థి, రాజకీయ ఐక్య కార్యాచరణ వేదికలు ఏర్పాటు అయ్యాయి. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని అణచివేసేందుకు ఉమ్మడి పాలకులు అన్ని మార్గాలను అనుసరించారు. జగిత్యాలలో నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందిన ఘటనలూ ఉన్నాయి.
హైదరాబాద్ జంట నగరాల్లో అమృతరావు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా సెంట్రల్ బ్యాంక్, స్టేట్ బ్యాంకు సహా 33 మంది ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీ సుందర్రావు విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ ఆవశ్యకతను వివరిస్తూ ప్రధానికి లేఖ రాశారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కోసం తెలంగాణలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అప్పటి వరంగల్ ఎమ్మెల్యే టీఎస్ మూర్తి ఆందోళన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. చందాకాంతయ్య (ఏవీవీ) స్థాపించిన స్కూల్లో నేను అప్పుడు ఆరో తరగతి చదువుతున్న. విద్యార్థి ర్యాలీలో పాల్గొన్న. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని నినదించుకుంటూ ముందుకువెళ్లాం.
-బండా ప్రకాశ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం జరిగిన పోరాటం తెలుగు ప్రజల ఉద్యమ సత్తాను దేశానికి చాటేలా చేసింది. వందలాదిమంది ఇంజినీరింగ్ విద్యార్థులు నిరాహార దీక్ష చేశారు. ఆంధ్రా, తెలంగాణ అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. చాలా రోజులపాటు ఆందోళనలు కొనసాగాయి. ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిగా నేను చాలా రోజులు నిరసనలో పాల్గొన్న.
-కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ