దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..! నిర్మల బడ్జెట్ ప్రసంగ ప్రారంభంలో ప్రస్తావించిన గురజాడ వాక్యమిది. కానీ దేశమంటే రాష్ర్టాలు కూడా! అందులో తెలంగాణ కూడా! అందులోని ప్రజలు కూడా! ఇదే విషయాన్ని ఎప్పట్లాగే ఈసారీ కేంద్రం మరిచింది. కేంద్ర-రాష్ట్ర సత్సంబంధాలంటూ సీఎం రేవంత్ ఎంత చెప్పుకొంటూ తిరిగినా.. చివరికి రాష్ర్టానికి ఒరిగిందిమాత్రం ఏమీలేదు. కాంగెస్‌కు, బీజేపీకి ఎనిమిదేసి ఎంపీలను గెలిపించి ఇచ్చిన తెలంగాణకు బడ్జెట్లో ఈసారి దక్కింది గుండుసున్నానే! 8+8=0 అని మరోసారి రుజువైంది. పసుపుబోర్డు, రీజినల్ రింగ్ రోడ్డు సహా తెలంగాణ ప్రాజెక్టులకూ కేంద్రం బడ్జెట్లో పైసా విదిల్చలేదు.
Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఫలితంగా బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా బడ్జెట్లో రాష్ట్రానికి గుండుసున్నా మిగిలింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో రూ.50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేళపెట్టగా, తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టునుగానీ, కార్యక్రమాన్నిగానీ ప్రకటించలేదు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా నిధులు సాధించడంలో విఫలమయ్యారు. ‘మోదీ మా బడేభాయ్.. కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలుసు’ అంటూ రేవంత్‌రెడ్డి చెప్పుకున్న గొప్పలన్నీ గప్పాలని తేలిపోయింది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రూ.1.63 లక్షల కోట్ల ప్రతిపాదనలు పంపినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
అయితే, సరైన సమయంలో సరైన విధానంలో ఈ ప్రతిపాదనలు పంపలేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. బడ్జెట్ కసరత్తు మొదలయ్యే సమయంలోనే ప్రతిపాదనలు పంపాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభు త్వం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. బడ్జె ట్ కూర్పు తుది దశకు చేరుకున్న తర్వాత హడావుడిగా రూ.1.63 లక్షల కోట్ల ప్రతిపాదనలు అందించారని చెప్తున్నారు. ఇందులోనూ ప్రాధాన్యరంగాలను ఎంచుకోకుండా తలాతోక లేకుండా ప్రతిపాదనలను సమర్పించారని విమర్శిస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ, మూసీ పునర్జీవం, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బ య్యారం ఉకు కర్మాగారం, నవోదయ, కేం ద్రీయ విద్యాలయాల మంజూరు, ఇతర మౌ లిక సదుపాయాల ప్రాజెక్టులతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ గ్రాంట్లు ఇవ్వాలని ప్రతిపాదించినట్టు ప్రభు త్వం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డి మాండ్లయిన.. రీజినల్ రింగ్ రోడ్డుకు, మెట్రో కు కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని, దీనికి బడ్జెట్లోనే కేటాయింపులు అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు ఇంతవరకు డీపీఆర్‌లు పూర్తి కాలేదని, కేంద్ర బడ్జెట్లో నిధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించిన రంగాలకు, రాష్ట్ర సర్కారు ప్రతిపాదించిన రంగాలకు సంబం ధం లేకుండాపోయిందని అంటున్నారు. అందుకే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో గుండుసున్నా మిగిలిందని చెప్తున్నారు.
‘అష్ట’నష్టాలపై జనాగ్రహం
కాంగ్రెస్, బీజేపీకి రాష్ట్రంలో చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి, పార్లమెంట్‌కు పంపిస్తే తెలంగాణకు లాభం లేకుండాపోయిందని విశ్లేషకులు వాపోతున్నారు. చెప్పుకోవడానికి ఇద్దరు కేంద్రమంత్రులున్నా.. రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్లో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకపోవటంతో తెలంగాణకు జరుగుతున్న నష్టం ఏ స్థాయిలో ఉంటుందో బడ్జెట్ మరోసారి స్పష్టం చేసిందని చెప్తున్నారు. ‘వాళ్లూ..వీళ్లూ కలిసి తెలంగాణకు ‘అష్ట’నష్టకులుగా దాపురించారు’ అని పేరు రాయడానికి నిరాకరించిన ఒక ఆర్థిక నిపుణుడు వ్యాఖ్యానించారు.
బీజేపీ నిష్క్రియాపరత్వం
కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ బడ్జెట్ కసరత్తు జరుగుతున్న సమయంలోనే రాష్ర్టానికి ఏం కావాలి? గతంలో కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చిన పథకాలేమిటి? వాటి కార్యాచరణ తీరుతెన్నులు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొత్తగా చేసిన ప్రతిపాదనలు ఏమిటి? ఆయా ప్రతిపాదనలు కేంద్ర ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? లేకపోతే సవరింపు ప్రతిపాదనలు ఏవైనా ఉన్నాయా? కొత్తగా ప్రతిపాదించేవి ఏవైనా ఉన్నాయా? వంటి వాటిపై దృష్టి సారించకపోవడం వల్ల కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరగలేదని ఆర్థిక నిపుణులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్ విఫలం
బడ్జెట్లో రాష్ర్టానికి అదనంగా ఎటువంటి కేటాయింపులు చేయకపోవడానికి కాంగ్రెస సర్కారే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ర్టానికి కావలసిన ప్రయోజనాలను గత బీఆర్ఎస్ పొందలేకపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక బహిరంగ సభల్లో విమర్శించారు. తక్కిన మంత్రులు సమయం దొరికితే అదేపాట పాడారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి బడేభాయ్ అని పిలవడంతో ‘ఇక రాష్ర్టానికి కేంద్రం నుంచి నిధులకు ఢోకా ఉండదు’ అని అనుకుంటే వారి బంధం దృఢపడింది కానీ తెలంగాణకు లాభం లేకుండాపోయిందని బీఆర్ఎస్ విమర్శిస్తున్నది. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందంటూ విమర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి , మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పుడేం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ సహా విభజన హామీలపై కేంద్రం మరోసారి పక్షపాత వైఖరిని ప్రదర్శించింది.
ప్రాంతీయ పార్టీలతోనే రాష్ర్టాలకు న్యాయం
ప్రాంతీయ పార్టీల నుంచి ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తేనే రాష్ర్టాలకు న్యా యం జరుగుతుంది. ఈ వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. బడ్జెట్లో రాష్ర్టాన్ని మరోసారి విస్మరించారు. రాష్ర్టానికి ఐఐఎం, ఐఐఐటీ సంస్థలను కేటాయించాలని అడుగుతున్నా పట్టించుకోలేదు. ఎన్నికలుంటేనే రాష్ర్టాలను పట్టించుకుంటామనే వైఖరి సరికాదు. రాష్ర్టానికి దక్కాల్సిన ప్రయోజనాలపై రాజ్యసభలో ఉద్యమిస్తాం. పదేండ్లుగా మోదీ పేద, మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేశారు.
-మాజీ ఎంపీ వినోద్‌కుమార్
బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం
బడ్జెట్లో రాష్ర్టానికి పైసా కేటాయించకపోవడం అన్యాయం. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్, ఢిల్లీ రాష్ట్రాలకు వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని మామూనూర్ పునరుద్ధరణ, కొత్తగూడెం, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాలను గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడం సరికాదు. పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదానిచ్చి నిధులు కేటాయించాలనే న్యాయమైన డిమాండ్‌ను కూడా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్న బయ్యారం ఉకు కర్మాగారం, ప్రముఖ విద్యాసంస్థల ఏర్పాటును పట్టించుకోలేదు.
-రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
కేంద్ర విధానాలతో సాగురంగం కుదేలు
ఎరువుల సబ్సిడీ గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే 3,412 కోట్లు తగ్గించారు. ఇది వ్యవసాయ రంగం, రైతుల మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుం ది. ఆహార సబ్సిడీని తగ్గించింది. ఇది పేదల జీవితాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు. 2026లో యూపీ, 2027లో గుజరాత్ కోసం బడ్జెట్ పెడతారా?.. తెలంగాణకు చోటులేదా?. ఇద్దరు కేంద్ర మంత్రులుసహా 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం సాధించారు?
-వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
రేవంత్ సాధించింది.. ‘గుండు సున్నా’
ఏడాదిలో 30సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాక ట్టు పెట్టి సాధించింది మాత్రం గుండు సున్నా. కేంద్ర బడ్జెట్లో నిధులు సాధించ డంలో రేవంత్ పూర్తిగా విఫలమైంది. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి తీరని అన్యాయం జరిగింది. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసింది. బడ్జెట్లో బీహార్, ఢిల్లీ, ఏపీ, గుజరాత్‌లకు ప్రాధాన్యత నివ్వడంపై రాష్ర్టానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు ఏం సమాధానం చెబుతారు. ఆర్థిక మంత్రికి తెలంగాణ కనిపించలేదా?
– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
రాజకీయ లబ్ధి దిశగానే నిధుల కేటాయింపు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కేటాయింపులు ఉన్నాయి. ‘దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులంటూ గురజాడ సూక్తిని ఉటంకించిన ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్..కేటాయింపుల్లో మాత్రం పేదలకు మొండిచెయ్యి చూపింది. సంపన్నులకు మాత్రమే మేలు చేసేలా బడ్జెట్ ఉంది. గతంలో కేసీఆర్ రూపొందించిన పథకాల స్ఫూర్తి కేటాయింపుల్లో కొరవడింది.ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి మేలుచేసి తెలంగాణకు మాత్రం అన్యాయం చేసింది.
– పొన్నాల