Cyber Crime | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల చేతిలో తెలంగాణ యువత పావులుగా మారుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చన్న అత్యాశతో కొందరు, తెలిసీ తెలియక మరికొందరు సైబర్ మోసాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇటీవల ఓ కేసు దర్యాప్తులో హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు కొన్ని బ్యాంకు ఖాతాలపై అనుమానం రావడంతో వాటిని ఎవరు ఎక్క డి నుంచి ఆపరేట్ చేస్తున్నారో ఆరా తీశారు.
కోదాడలోని ఓ గ్రామంలో ఆ ఖాతాలు ఉన్న ట్టు తెలియడంతో అక్కడికి వెళ్లారు. ఓ ఇంజినీరింగ్ విద్యార్థినితోపాటు అగ్రికల్చర్ బీటెక్ చేసిన మరో యువకుడి సంబంధించిన ఖాతాలతో సైబర్ నేరానికి లింక్ ఉన్నట్టు గుర్తించడంతో ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని ప్ర శ్నించడంతో అలాంటివారు ఆ చుట్టుపక్క గ్రామాల్లో చాలా మంది ఉన్నట్టు తేలడంతోపాటు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చా యి. ‘పలానా వాళ్లు ట్రేడింగ్‌లో భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. నెలకు రూ. లక్ష ఆర్జిస్తున్నారు. నువ్వు కూడా వెంటనే ఆ పని మొదలుపెట్టు’ అంటూ కొందరు తల్లిదండ్రులే తమ పిల్లలపై ఒత్తిడి తెస్తున్నట్టు వెల్లడైంది.
ఇలాంటి అమాయకులను సైబర్ నేరగాళ్లు పావులుగా వాడుకొంటున్నారు. ట్రేడింగ్‌లో మంచి లాభాలను ఆర్జించవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పించి వారిని ఆకర్షిస్తున్నారు. ఆపై ఆ నేరగాళ్ల ముఠాలోని సభ్యులే వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లలో గ్రూపులను ఏర్పాటు చేసుకుని పలానా షేర్లలో తాము భారీగా లాభాలు పొందామని, పలానా షేర్లలో జాక్‌పాట్ తగిలిందని చాటింగ్ చేసుకుంటూ కొత్తవారిని రెచ్చగొడుతున్నారు. వారి వలలో చిక్కినవారికి కొన్ని యాప్‌లు, వెబ్సైట్ల లింకులు పంపి వాటిలోనే ట్రేడింగ్ చేయాలని సూచిస్తున్నారు.
అలా మొదట్లో స్వల్పంగా, ఆ తర్వాత భారీగా లాభాలు వచ్చినట్టు స్క్రీన్లపై చూపిస్తున్నప్పటికీ ఆ సొమ్మును డ్రా చేసుకునేందుకు వీల్లేకుండా చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. కొత్త ఎత్తులు వేస్తున్నారు. టెక్నికల్ సమస్య వల్లే మీ సొమ్మును డ్రా చేసుకోలేకపోతున్నారని, ఆ సొమ్మును పొందాలంటే మీ బ్యాంకు ఖాతాలను కిరాయికి ఇవ్వాలని, ఆ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేస్తామని, ఆ సొమ్మును యూఎస్డీ, యూఎస్డీటీ, క్రిప్టో కరెన్సీగా మార్చి తాము సూచించిన ఖాతాల్లోకి పంపాలని నమ్మబలుకుతున్నారు.
దీంతో ఆ అమాయకులు తమ సొమ్మును రాబట్టుకునేందుకు బ్యాంకు ఖాతాలను కిరాయికి ఇవ్వడంతో కేటుగాళ్లు మరికొందరు ఇతరులను మోసగించడం ద్వారా వచ్చిన సొమ్మును ఆ ఖాతాల్లో డిపాజిట్ చేయిస్తున్నారు. ఆ ఖాతాదారులు ఆ సొమ్మును క్రిప్టో కరెన్సీగా మార్చి సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాల్లోకి పంపడం ద్వారా 5% కమిషన్ పొందుతున్నారు. అలా రోజూ వేలల్లో కమిషన్ వస్తున్న విషయం ఇతరులకు తెలియండటంతో వారు కూడా తమ ఖాతాలను కిరాయికి ఇస్తామంటూ మందుకొచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలను కిరాయికి ఇవ్వడం నేరమని సైబర్‌క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియనివారి నుంచి మన ఖాతాలోకి డబ్బు వచ్చిందంటే అది నేరానికి సంబంధించినదే అయి ఉంటుందని గుర్తించాలని, లేకుంటే ఆ ఖాతాదారులు నిందితులుగా మారడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో, ఆన్లైన్లో వచ్చే లింకులను ఓపెన్ చేసి నకిలీ యాప్‌లు, వెబ్సైట్ల ద్వారా ట్రేడింగ్ చేస్తే మోసపోక తప్పదని, ఎలాంటి ట్రేడింగ్నైనా అధికారిక వెబ్సైట్ల ద్వారానే చేయాలని సూచిస్తున్నారు.