హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): పోలవరం ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ ప్రభుత్వం డిమాం డ్ చేసింది. ముంపుపై జాయింట్ సర్వే చేపట్టాలని కేంద్రం నిర్దేశించినా ఆ దిశగా ఇప్పటికీ స్పందించకపోవటంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి (పీపీఏ) ఘాటుగా లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు ముం పుతోపాటు ఇతర అనేక సాంకేతిక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలు సుప్రీంకోర్టును ఆశ్రయించటం, ఈ నేపథ్యంలో అన్ని రాష్ర్టాలతో ఏకాభిప్రాయం సాధించాలని కోర్టు ఆదేశించడం తెలిసిందే. అన్ని రాష్ర్టాలతో ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన సీడబ్ల్యూసీ ఇటీవల ఢిల్లీలో మూడో సమావేశాన్ని నిర్వహించింది.
ఏపీని సమన్వయం చేసుకుంటూ సం యుక్త సర్వే చేపట్టాలని పీపీఏకు సీడబ్ల్యూసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10వ తేదీ లోగా తెలంగాణ, ఏపీ ఇరురాష్ర్టాలతో సమావేశం నిర్వహించాలని అల్టిమేటం జారీ చేసింది. అయినప్పటికీ పీపీఏ ఇప్పటికీ వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలం మొక్కుబడిగా 12వ తేదీన సమావేశాన్ని అదికూడా వర్చువల్గా నిర్వహించింది. ఆ సమావేశానికి సైతం ఏపీ హాజరుకాలేదు. పీపీఏ ఉదాసీన వైఖరిని తెలంగాణ తీవ్రంగా ఆక్షేపించింది. తాజాగా పీపీఏకు మరోసారి ఘాటు లేఖను రాసింది. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా సర్వేకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.