 
                                                            హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 30: ‘అయ్యో దేవుడా.. మేం ఎట్ల బతకాలె.. నేనేం సెయ్యాల నాయన… నిన్నటిదాక ఈడనే ఉన్న… ఏం జేత్తే అయితది. నిన్న మంచిగనే ఉన్నయి. మంచిగ నేర్పిన. మ్యాచర్ కూడ మంచిగనే వచ్చింది. అయినా కొనలేదు. ఓ దేవుడా.. నేనేం జెయ్యాలె’ అంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామానికి చెందిన మహిళా రైతు కేడిక తారవ్వ గుండెలు అవిసెలా రోదించింది. గురువారం ఉదయం 10గంటలకు హుస్నాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చిన ఆమె, షెడ్డులో ధాన్యం చూస్తే కనిపించలేదు.
పక్కనే ఉన్న కాలువలో వర్షపు నీటికి కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి గుండెలు బాదుకుంటూ కన్నీటి పర్యంతమైంది. ‘నెల దాటింది. వడ్లు పట్టుమని చెప్పితేనే పట్టినం. ఇంతలోనే మా అల్లుడు చనిపోయిండు. మ్యాచర్ వచ్చింది. కిలో ఎక్కువగా పెట్టుకోమని చెప్పినం. అయినా పెట్టు కోలేదు. మా పరిస్థితి మంచిగలేదు. పదిహేనురోజులు అవుతంది. కిలో అన్ని ఎక్కువగా తీసుకోమని చెప్పినం. మాకు బతుకేలేదు. మేం బతకొద్దు. మేం ఉండద్దు భూమి మీద. శాతగానోల్లం. కైకిల్లకు పెట్టి ఎవుసం చేయించినం. అయినా 17 మ్యాచర్ రావాలన్నరు.
రాత్రి వాన పడి ధాన్యం కొట్టుకుపోయింది’ అని కాలువలో పోతున్న ధాన్యం చూసి రోదించిన రైతును చూసి అక్కడ ఉన్నవారిని కలిచివేసింది. హుస్నాబాద్ మార్కెట్ యార్డులోని పరిస్థితిని పరిశీలించేందుకు గురువారం వచ్చిన బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కన్నీళ్లుపెడుతూ తన అవస్థను వెళ్లగక్కింది. రైతు తారవ్వ రోదనలు, దీనావస్థను చూసి మార్కెట్‌యార్డులోని మహిళా రైతులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ధాన్యాన్ని పరిశీలించేందుకు వచ్చిన సిద్దిపేట కలెక్టర్ హైమావతి, ఆర్డీవోతోపాటు నాయకులందరి కాళ్లు మొక్కి తమను కాపాడలంటూ ఆమె వేడుకున్నది.
గంగాధర/ బోయినపల్లి రూరల్, అక్టోబర్ 30 : తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన చొప్పదండి నియోజకవర్గంలో మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మొదట కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుభూత్కూర్ కొనుగోలు కేంద్రంలో.. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిపాటు తడగొండలో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి చలించిపోయారు. సకాలంలో కొనుగోళ్లను ప్రారంభిచకపోవడంతోనే రైతులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చిందని, తుపాను ప్రభావంతో ధాన్యం తడిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
మంచాల, అక్టోబర్ 30: రెండు రోజుల్లో వరిని కోసి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుందామనుకుంటే అంతలోనే తుపాను వచ్చి పంటను మొత్తం నేలపాలు చేసిందని రైతు మారగోని మారమ్మ కన్నీరు మున్నీరైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు చెందిన మారమ్మకు రెండు ఎకరాల పొలం ఉన్నది. ఎకరం పొలంలో వరి, మరో ఎకరంలో టమాట సాగుచేసుకుంటున్నది. రెండు ఎకరాల్లో పంటల సాగుకోసం రూ.60 వేలు ఖర్చు చేసింది. వరి కోత దశలోనే వాన రూపంలో తన పంటను నేలపాలు చేసిందని, టమాట మొత్తం దెబ్బతిన్నదని రోదించింది. అప్పు చేసి పంటలను సాగుచేస్తే తుపాను తన పంటలను మింగేసిందని రైతు మారమ్మ తన పొలంలో పంటను చూపిస్తూ కంటతడి పెట్టింది.
 
                            