Harsha Bhargavi | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మహిళా అధికారికి దేశ రాజధానిలో తీవ్ర అవమానం జరిగింది. అధికార హోదాలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో అధికారులు సైతం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే పరిస్థితి లేదని ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న పౌరసంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హర్ష భార్గవి శనివారం ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర పౌరసంబంధాల శాఖ పీఆర్వోగా నియమితులైన ఆమె ప్రొటోకాల్ ప్రకారం మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ఢిల్లీలో ఆయన ఇంటికి వెళ్లడంతో అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు.
హర్ష భార్గవి ఎవరో తమకు తెలియదని, లోపలికి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆమె పోలీసులకు తన ఐడీ కార్డును చూపి, పౌరసంబంధాల శాఖ అధికారినని తెలియజేశారు. అయిన్పటికీ హర్ష భార్గవిని అక్కడి నుంచి పంపేయాలని సీఎం ఇంటి లోపలి నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆమె అక్కడి నుంచి వెళ్లకపోవడంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కానీ, అక్కడే ఉన్న రాష్ట్ర మీడియా ప్రతినిధులు పోలీసులకు సర్దిచెప్పారు. హర్ష భార్గవి రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నారని తెలియజేసి, ఆమె అరెస్ట్‌ను అడ్డుకున్నారు.
రెండేండ్లుగా వేధిస్తున్నారు.. రెసిడెంట్ కమిషనర్ గెటౌట్ అన్నారు.. హర్ష భార్గవి ఆవేదన
ఈ ఘటనపై హర్ష భార్గవి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. తన గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్రం నుంచి ఢిల్లీకి వచ్చిన తనపై కొందరు పార్టీ ముద్రవేసి రెండేండ్లుగా వేధిస్తున్నారని, కుటుంబంతో ఏడాదిగా ఢిల్లీలో ఉంటూ వేతనం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తనకు రాష్ట్ర పౌరసంబంధాల శాఖ నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చక్రవర్తి అనే ఔట్సోర్సింగ్ ఉద్యోగి కోసం రెగ్యులర్ ఉద్యోగినైన తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. చక్రవర్తి ప్రోద్బలంతో ప్రభుత్వం తనపై విజిలెన్స్‌తోపాటు అన్ని రకాల విచారణలు జరిపించిందని, ఆ నివేదికలను సీఎం పరిశీలించి ఓకే చెప్పిన తర్వాతే తనకు ఉత్తర్వులిచ్చారని వివరించారు. అయినప్పటికీ తనపై వేధింపులు, కక్ష సాధింపులు ఆగలేదని, ఈ విషయమై రెసిడెంట్ కమిషనర్‌ను కలువడంతో గెటౌట్ అంటూ తనను వెళ్లగొట్టారని బాధపడుతూ.. ఇదేం అన్యాయం? మహిళా ఉద్యోగుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు.