హైదరాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యవసాయరంగ అభివృద్ధి ప్రత్యేక గుర్తింపు దక్కింది. వ్యవసాయరంగానికి సంబంధించి జీ-20 సన్నాహక సదస్సును తెలంగాణ వేదికగా నిర్వహించనున్నారు. ఈ సదస్సు రాష్ట్రంలో నిర్వహించటం..వ్యవసాయరంగ అభివృద్ధికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది చివర్లో జరిగే జీ-20 సదస్సుకు మన దేశం ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
కేంద్రప్రభుత్వం వివిధ రంగాల సన్నాహక సమావేశాలను ఆయా రాష్ర్టాల్లో నిర్వహిస్తున్నది. వ్యవసాయరంగంపై సన్నాహాక సమావేశాన్ని హైదరాబాద్ వేదికగా ఈ నెల 15 నుంచి 17 వరకు హైటెక్స్‌లో నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 30 దేశాలకు చెందిన వ్యవసాయశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. సదస్సులో పలు దేశాల మధ్య వ్యవసాయరంగానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరుగనున్నాయి. పరస్పర సహకారం కోసం ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కూడా జరగనున్నాయి. సదస్సును ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది.