హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవటానికి బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ అని, 2024లో కూడా తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. నాడు, నేడు, ఏనాడైన తెలంగాణ గళం, తెలంగాణ బలం, తెలంగాణ దళం బీఆర్ఎస్సేనంటూ ఎక్స్‌లో వెల్లడించారు. 16, 17వ లోక్‌సభ లెక్కల ప్రకారం బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాలు, హక్కుల గురించి అడిగిన ప్రశ్నలే ఇందుకు నిదర్శనమని వివరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ బృందానికి ఎందుకు ఓటు వెయ్యాలో ఈ లెక్కలే స్పష్టం చేస్తాయని పేర్కొన్నారు.