ప్రధాని వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న ప్రజలు
మోదీ క్షమాపణ చెప్పేదాకా వదిలేది లేదు
ఊరూరా నల్లజెండాలు.. చావు డప్పు
బైక్ ర్యాలీలు.. దిష్టిబొమ్మల దహనాలు
వినూత్న ఆందోళనలు.. నిరసనల హోరు
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప్పుల మోతతో తెలంగాణ గర్జన గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రతిధ్వనించింది. తెలంగాణ తెరువొస్తే తెర్లయిపోతరని హెచ్చరించింది.
టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు యావత్ తెలంగాణ సమాజం కదలివచ్చింది. ‘మోదీ ఖబడ్దార్’ అంటూ తీవ్రంగా హెచ్చరించింది. దశాబ్దాల తరబడి నిరాఘాటంగా పోరాడి సాధించుకొన్న తెలంగాణపై కండ్లల్లో నిప్పులు పోసుకొంటున్న బీజేపీపై విరుచుకుపడింది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, యువకులు, కార్మికులు, కర్షకులు తెలంగాణ చైతన్యాన్ని మరోసారి చాటిచెప్పారు.
టీఆర్ఎస్ కార్యకర్త దగ్గరి నుంచి మంత్రులదాకా మోదీ వైఖరిని నడిరోడ్డుమీదకు ఈడ్చారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు మోదీ వ్యాఖ్యలను ఎండగట్టారు. తెలంగాణకు అన్యాయం చేస్తే.. తెలంగాణపై ప్రేలాపనలు చేస్తే.. తెలంగాణను చిన్నతనంగా చూస్తే.. తెలంగాణ ప్రజ ఎంత తీవ్రంగా ప్రతిస్పందిస్తుందో బుధవారం మోదీ అండ్ కో కు రుచి చూపించింది. చివరకు మోదీ వ్యాఖ్యలను సమర్థించుకోలేక.. విమర్శించనూ లేక.. రాష్ట్ర బీజేపీ నేతలు విలవిల్లాడిపోయారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 9 : కదిలిందిర తెలంగాణ.. ఖబడ్దార్ ఖబడ్దార్.. మోదీ హఠావో.. దేశ్ బచావో, మోదీ ముర్దాబాద్, తెలంగాణ జిందాబాద్.. బుధవారం తెలంగాణలో ఎక్కడ చూసి నా ఇవే నినాదాలు.. ఇవే ప్రతిధ్వనులు. తెలంగాణ ఏర్పాటు అప్రజాస్వామికంగా జరిగిందని రాజ్యసభ సాక్షిగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం నిప్పులు చెరిగింది. గత ఎనిమిదేండ్లుగా అవకాశమొచ్చినప్పుడల్లా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా.. ఎలాంటి హామీలు నెరవేర్చకపోయినా, నిధులు ఇవ్వకపోయినా నివురుగప్పినట్టుగా ఉన్న ప్రజానీకం.. ఏకంగా రాష్ట్ర ఏర్పాటునే అవమానించడంతో సహించలేకపోయింది. మోదీపై సింహమై గర్జించింది. తన ఆత్మగౌరవాన్ని అవహేళన చేశారని మండిపడింది. రాష్ట్ర ఉద్యమం నాటి చేతన మరోసారి ఢిల్లీ 7 లోక్నాయక్మార్గ్ (పీఎం నివాసం) దాకా ప్ర జ్వరిల్లింది. మోదీ వ్యాఖ్యల వెనక రాష్ర్టానికి కీడు చేసే పన్నాగమేదో ఉన్నదని గ్రహించిన ప్రజానీకం ఒక్కసారిగా విరుచుకుపడింది. రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం యావత్తు పార్టీ శ్రేణులు వీధికెక్కాయి. బుద్ధిజీవులు, మేధావులు, ప్రజాసంఘాలు, యువకులు, కార్మికులు, కర్షకులు తెలంగాణ చేతనాన్ని మరోసారి చాటిచెప్పారు. తెలంగాణ తెరువొస్తే తెర్లయిపోతావని మోదీని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు మోదీకి వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. మరోవైపు ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ తక్షణమే బేషరతుగా జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.
మోగిన చావుడప్పు
తెలంగాణతో గోక్కున్నోళ్లకు చరిత్రలో ఏ గతి పట్టిం దో.. మోదీకి అదే గతి పడుతుందని టీఆర్ఎస్ హెచ్చరించింది. మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గం గుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇం ద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతిరాథోడ్ వివిధ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడిక్కడ కదంతొక్కారు. ఊరూరా మోదీకి చావుడప్పు మోగించారు. పాడె మో సి.. శవయాత్రలు చేసి.. దింపుడుకల్లం నిర్వహించి.. కుండపట్టి.. నిప్పుపెట్టారు. నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. నల్లజెండాలు చేబూని, నల్లదుస్తులు ధరించి నిరసనల్లో పాల్గొన్నారు.
ఒకే ఒక్క పిలుపు
మోదీ వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాల ని మంత్రి కేటీఆర్ మంగళవారం రాత్రి 11 గంటలకు మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఆ పిలుపు ప్రభా వం తెల్లారేసరికి వివిధ రూపాల్లో ఆవిష్కృతమైంది. టీఆర్ఎస్ శ్రేణులు తమ ఉద్యమ రూపాన్ని మోదీకి రుచి చూపాయి. ప్రజాసంఘాలు, ఉద్యమ సంఘాలు, వృత్తి సంఘాలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. బీసీ కమిషన్ సభ్యులు సైతం నిరసనకు ప్రతీకగా నల్లబ్యాడ్జీలు ధరించారు. అర్చక, ఉద్యోగ జేఏసీ తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. బుధవారం అర్చకభవనంలో గంగు ఉపేంద్రశర్మ నేతృత్వంలో సమావేశమైన జేఏసీ ప్రతినిధులు.. బీజేపీ నేతలు ప్రశాంతతకు భంగం కలిగించవద్దని హితవు పలికారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు నిరసన కార్యక్రమాలను సమన్వయం చేశారు.