హైదరాబాద్, నవంబర్19 (నమస్తే తెలంగాణ): పేద, బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమానికి కొత్త బాటలు వేస్తున్నది. విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతూ దేశానికి కొత్త దిశను చూపుతున్నది. తెలంగాణలో గడిచిన ఎనిమిదేండ్లలో సంక్షేమ రంగానికి బడ్జెట్ కేటాయింపులు మూడురెట్లు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వార్షిక నివేదికలో వెల్లడించింది.
సామాజిక అభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో ఏటా నిధులను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నదని ఆర్బీఐ హ్యాండ్‌బుక్-2022లో పేర్కొన్నది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సామాజిక సంక్షేమ రంగాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ. 24,424 కోట్లు కేటాయించగా.. 2021-22 నాటికి అది మూడు రెట్లు పెరిగి రూ.98,425 కోట్లకు చేరిందని వెల్లడించింది.
అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ర్టాలు గడిచిన ఎనిమిదేండ్లలో సామాజిక అభివృద్ధికి బడ్జెట్ నిధులను రెండింతలు కూడా పెంచలేదు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కూడా సంక్షేమరంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో వెనుకబడిన రాష్ర్టాల కన్నా అధ్వానంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కంటే తక్కువగా గుజరాత్ కేటాయింపులు ఉండటం గమనార్హం.