దేశంలో టాప్ 10లో ఏడు తెలంగాణ గ్రామాలు
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో రికార్డు
పల్లె ప్రగతి, మిషన్ భగీరథతో పల్లెకు పట్టం
టాప్ 20లో 11 గ్రామాలు మనవే
సకల సౌకర్యాలతో అలరారుతున్న గ్రామసీమలు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 : పచ్చని చెట్లే తోరణాలై, పరిశుభ్రతకు ఆలవాలమై అలరారుతున్న తెలంగాణ పల్లెలు దేశానికి కాంతిరేఖలై దారిచూపుతున్నాయి. పల్లె ప్రగతితో పల్లవిస్తున్న మన పల్లెలు మరోసారి జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామాలుగా నిలిచాయి. రాష్ట్రప్రభుత్వం ప్రతినెలా క్రమం తప్పకుండా గ్రామపంచాయతీలకు నిధులిస్తూ ప్రగతిపథంలో నడిపిస్తున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (ఎస్ఏజీవై) పథకంలో భాగంగా ప్రకటించే ర్యాంకుల్లో దేశంలోనే టాప్ టెన్‌లో ఏకంగా ఏడు గ్రామాలు తెలంగాణకు చెందినవే నిలిచాయి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని ఏడు గ్రామాలు దేశంలోని లక్షల గ్రామాలను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకొన్నాయి.
పల్లె ప్రగతి ద్వారానే..
తెలంగాణ పల్లెలకు జాతీయస్థాయిలో అత్యుత్తమ గుర్తింపు రావటానికి పల్లెప్రగతి కార్యక్రమమే ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. ఎస్ఏజీవైలో దేశవ్యాప్తంగా ఎంపీలు దత్తత తీసుకొన్న గ్రామాలకు కొన్ని మార్గదర్శకాలు, ప్రామాణికాల ఆధారంగా స్కోర్ ఇస్తున్నారు. ఈ స్కోర్నుబట్టే గ్రామాలకు ర్యాంకులు కేటాయిస్తున్నారు. తాజా ర్యాంకుల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. దేశంలోని టాప్ 10లో ఏడు, టాప్ 20లో 11 గ్రామాలు తెలంగాణవే ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీటిని అందించడం, పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన వైకుంఠధామాలు, మొక్కల పెంపకం, నర్సరీలు, ట్రాక్టర్, డంపింగ్ షెడ్డు, ఇంకుడు గుంతల నిర్మాణం, ఇంటింటి నుంచి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలు క్రమబద్ధంగా జరుగుతుండటం, ప్రతి నెలా రాష్ట్రప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తుండటంతో పల్లెలు ప్రగతి పథకంలో సాగుతున్నాయి. అందువల్లనే ఎస్ఏజీవై పథకంలో అత్యధిక స్కోర్ సాధించి టాప్ ర్యాంకులు సొంతం చేసుకొన్నాయి. వెన్నంపల్లి నంబర్ 1 ఎస్ఏజీవై ర్యాంకుల్లో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి దేశంలోనే మొదటి ర్యాంక్ సాధించింది. ఈ గ్రామాన్ని టీఎఆర్ఎస్ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు దత్తత తీసుకొని అభివృద్ధిచేశారు. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ దత్తత తీసుకొన్న రెండు గ్రామాలు కూడా టాప్ టెన్‌లో నిలువటం విశేషం. 2016 లో ఎస్ఏజీవై ప్రారంభమైన వెంటనే కరీంనగర్ జిల్లా గన్నేరువరం, వీర్నపల్లి గ్రామాలను ఆయన దత్తత తీసుకొన్నారు. ఎంపీ నిధులతోపాటు సీఎస్ఆర్ నిధులను పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన కల్వకుంట్ల కవిత దత్తత తీసుకొన్న రెంజల్ మండలం కందకుర్తి గ్రామం ఐదు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దత్తత తీసుకొన్న నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామం రెండో ర్యాంకులో నిలిచాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రామకృష్ణాపూర్ గ్రామం 9, నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ మండలం తానాకుర్ద్ గ్రామం 10వ స్థానం దక్కించుకొన్నాయి.
స్వయం సమృద్ధి గ్రామాలే లక్ష్యం
పార్లమెంట్ సభ్యులు ఏటా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఏజీవై పథకాన్ని 2016లో ప్రారంభించారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఎంపీలు ప్రత్యేకంగా కృషిచేయాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతోపాటు ఎంపీ నిధులను కేటాయించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఇందులో గ్రామ అభివృద్ధి ప్రణాళికను గ్రామస్థులే రూపొందించుకొంటారు. బలమైన గ్రామ పంచాయతీ వ్యవస్థ, చురుకైన గ్రామ సభలు, స్థానిక ప్రజాస్వామ్యం బలోపేతం చేయటమే ఈ పథకం ముఖ్యఉద్దేశం.