కరీంనగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): మహా సాహితీ శిఖరం నేలకొరిగింది. అమరభాషా పాండిత్యం మూగబోయింది. సంస్కృత భాష చిన్నబోయింది. 86 ఏండ్ల ఆధునిక, అభ్యుదయ, మధుర మంజుల మ నోహర కవితాధార ఆగిపోయింది. ప్రముఖ సంస్కృత భాషా పండితులు, కవి, మహామహోపాధ్యాయ, అమరభాషా ప్రేమికుడు పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి అస్తమించారు. నెలరోజులుగా శ్వాసకోస సంబంధ వ్యాధితో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున కరీంనగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. స్థానిక ఇరుకుల్ల వాగు ఒడ్డున ఉన్న పద్మనాయక శశ్మానవాటికలో ఆయన భౌతికకాయానికి కొడుకు వరప్రసాదశర్మ అం తిమ సంస్కారాలు నిర్వహించారు.
విజయసారథి మృతిపై సీఎం కేసీఆర్ తీవ్రక సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ వాచస్పతిగా గౌర వం అందుకున్న శ్రీ భాష్యం ఇకలేరనే వార్త తెలియగానే సాహితీ లోకంలో విషాదం అలుముకున్నది. కరీంనగర్‌లోని ఆయన స్వగృహానికి పెద్దసంఖ్యలో అభిమానులు, శిష్యులు తరలివచ్చి కన్నీటి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ తదితరులు శ్రీభాష్యం పార్థివదేహం వద్ద నివాళులర్పించారు.
నేలవాలిన మహా శిఖరం
విజయసారథి వందకుపైగా సంస్కృత గ్రం థాలను రచించి జాతీయస్థాయిలో రాష్ట్ర ఖ్యాతి ని ఇనుమడింపజేశారు. మందాకిని కావ్య కవి గా ప్రఖ్యాతిగాంచిన శ్రీభాష్యం విజయసారథి కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చేగుర్తిలో 1936 మార్చి 10న శ్రీ భాష్యం గోపమాంబ, నరసింహాచార్య దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే రచనలపై మక్కువ పెంచుకున్న శ్రీభాష్యం అప్పటి రజాకారుల ఆగడాలపై కవితలు, గేయాలు రాసి వినిపించేవారు. తొమ్మిదో ఏటనే రచనలు ప్రారంభించిన శ్రీభాష్యం 11వ ఏట శారదా పదకింకిణి, పదహారేండ్లలో శబరీ పరివేదనం, పదిహేడవ ఏట మనోహరం వంటి రచనలు చేయడంతో బాలకవిగా గుర్తింపు వచ్చింది.
రజాకారులు ఆయన కోసం వెతుకుతున్న తరుణంలో సోదరులు వరంగల్‌లోని విశ్వేశ్వర ఆంధ్రా సంస్కృత కళాశాలలో అప్పటివరకు పార్థసారథిగా ఉన్న పేరును విజయసారథిగా మార్చి చేర్పించారు. ఈ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన శ్రీభాష్యం అదే కళాశాలలో సుమారు 40 ఏండ్లపాటు అధ్యాపకులుగా కొనసాగి వేలాది మంది శిష్యులను సంపాదించుకున్నారు. సంస్కృతంలో మహాకవి కాళిదాసుకు తీసిపోకుండా వందకుపైగా రచనలు చేశారు. తెలంగాణ వాచస్పతిగా వినుతికెక్కారు. వైజ్ఞానిక, తాత్విక, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన రచనలు చేశారు. సంస్కృత భాషలో కూలంకషమైన పాండిత్యంతోపాటు మధుర మంజుల మనోహరంగా కవిత్వం చెప్పగల మహాకవి ఆయన. 86 ఏండ్ల వయసులోనూ నిత్య నూతన కవిత్వం కోసం ఆరాటపడేవారు. ఆయన మృతి సాహితీ లోకానికి తీరని లోటు. శ్రీభాష్యం సతీమణి హేమలత రెండేళ్ల క్రితం మరణించారు.
అమర భాషపై అమితమైన ప్రేమ
విజయసారథికి సంస్కృత పాండిత్యం పుట్టుకతోనే వారసత్వ సంపదగా అబ్బింది. ఆయన అమ్మమ్మ, తాతయ్య లలితాంబ, లక్ష్మణాచార్య సాన్నిహిత్యం ఆయనకు సంస్కృత భాషపై మక్కువ పెంచింది. బాల్యం నుంచే ప్ర శ్నించే మనస్తత్వం అలవడింది. సంస్కృతం అంటే అదేదో దైవమంత్రాల భాష అని చెప్పుకుంటున్న స్థితిలో సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని అనేక రచనలు చేశారు. దేశభక్తిని పెంపొందించే ఆయన రచనలో ముఖ్యమైనది భారత భారతి కవితా సంపుటి.
ఆధునిక సామాజిక సమస్యలను ప్రస్తావించడంతోపాటు వాటికి పరిష్కారాలను సూచించిన ఆధునిక, అభ్యుదయ కవి విజయసారథి. సంస్కృత భాషలో నవలలు, నాటకాలు, కా వ్యాలు, విమర్శలు, అలంకార గ్రంథాలు, సూక్తులు, సుప్రభాతాలెన్నింటినో రచించారు. బాసర సరస్వతి, హనుమకొండ భద్రకాళి, కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట రామాలయం, చిలుకూరి బాలాజీ ఆలయాల్లో ప్రతినిత్యం వినిపించే సుప్రభాతాలు శ్రీభాష్యం కలం నుంచి జాలువారినవే. మందాకిని గేయకా వ్యం సంస్కృత రచనల్లో నూతన ఒరవడిని సృష్టించింది. స్పష్టత, సూటిదనం ఉన్న ఆయన రచనలు పాఠకులను ఆకర్షిస్తాయి. సంగీత కళాకారుడు కూడా అయిన విజయసారథి రచించిన రసకేళి సంగీత నృత్యరూపకం ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.
సత్కారాలు.. సన్మానాలు
శ్రీభాష్యం విజయసారథి సంస్కృత భాషకు చేసిన సేవలకు అందిన సత్కారాలు చంద్రునికి నూలుపోగులాంటివి మాత్రమే. 2020లో ఆయనను పద్మశ్రీ అవార్డు వరించింది. దీనిని 2021 నవంబర్ 8న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. సంస్కృత భాషావేత్తగా దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ అందుకున్న మొదటి ఏకైక కవీశ్వరులు శ్రీభాష్యం. 2017 ఆగస్టు 15న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా విశిష్ట సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. 2018లో రాష్ట్రీయ మహాపీఠం తిరుపతి నుంచి మహామహోపాధ్యాయ బిరుదు. 1997లో కేకే బిర్లా ఫౌండేషన్ నుంచి వాచస్పతి పురస్కారం.
తిలక్ విద్యాపీఠం(పుణె) నుంచి ఇందిరా బిహారీ గోల్డ్‌మెడల్, హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ సంస్కృత పండిత పురస్కారం, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వర్రావు చేతుల మీదుగా మహాకవి బిరుదు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ సృజనాత్మక సంస్కృతకవి బిరుదు, తిరుమల ట్రస్ట్ పురస్కారం, కిన్నెర ఆర్ట్స్ ఘన సత్కారం, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సద్గురు శివానందమూర్తి చేతుల మీదుగా ఉగాది పురస్కారం, శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి చేతుల మీదుగా ఉత్తమ సంస్కృత పండిత బిరుదును పొందారు. ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి వారి రాష్ట్రస్థాయి ప్రతిభా పుస్కారాన్ని కూడా శ్రీభాష్యం అందుకున్నారు.
సర్వవైదిక సంస్థానం స్థాపన
విజయసారథి రచనలతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించేవారు. 1979లో కరపత్ర స్వామిజీ దర్శనం, నేపాల్‌లోని పశుపతినాథ శాస్త్రి దర్శనం ఆయన జీవితాన్ని మార్చేసింది. 1980లో బ్రాహ్మణులందరినీ ఒక వేదికపైకి చేర్చి కరీంనగర్లో సర్వవైదిక సంస్థానాన్ని నెలకొల్పారు. బొమ్మకల్‌లోని కృష్ణానగర్‌లో ఎకరం స్థలంలో శ్రీయజ్ఞ వరాహస్వామి ఆలయంతోపాటు సర్వవైదిక సంస్థానాన్ని స్థాపించారు. ఈ క్షేత్రంలో వేదోక్తంగా వైదిక కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు సర్వ జనహితంగా నిర్వహిస్తున్నారు. ఏటా ఒక కవి పండితులకు శ్రీభాష్యం పేరిట రూ.25 వేల నగదు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో ధర్మనిధి పేరిట వేదపండితులకు, కళాకారులకు కూడా పురస్కారాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థానానికి శ్రీభాష్యం కుమారుడు వరప్రసాద శర్మ ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు.
శ్రీభాష్యం మృతి తీరనిలోటు: సీఎం కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): శ్రీభాష్యం విజయసారథి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశ సంస్కృత భాషా పాండిత్యానికి తీరని లోటని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీభాష్యం సాహితీసేవను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. కవిత్వ సృజనతో పాటు, రాగయుక్తంగా కవిత్వాలాపన చేయడంలో శ్రీభాష్యం గొప్ప ప్రతిభను ప్రదర్శించేవారని, వర్తమాన కవులకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని పేరొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చంద్రశేఖర ప్రశస్తిః
ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ చేసిన ఉద్యమాలు, సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ‘చంద్రశేఖర ప్రశస్తిః’ పేరుతో సంస్కృత గ్రంథం రాశారు. ఇందులో ప్రతి శ్లోకంలో సీఎం కేసీఆర్ గొప్పతనాన్ని, ఆయన వాక్చాతుర్యాన్ని, రాజనీతిజ్ఞతను చాటిచెప్పారు. పండితుడు, ఓపిక కలవాడు, ధర్మాలు తెలిసినవాడుగా సీఎం కేసీఆర్‌ను అభివర్ణించారు. తన జాతి ఎదుగుదలకు మొక్కవోని దీక్షను చేపట్టి విజయం సాధించి, స్వరాష్ర్టాన్ని సాధించిన నేతగా కేసీఆర్ గురించి అనేక శ్లోకాల్లో వివరించారు. మచ్చుకు కొన్ని శ్లోకాలు..
‘ తెలంగాణ మహాశక్తి ప్రసాద ఇవ మూర్తిమాన్
చంద్రశేఖర రూపేణ మన్యేప్రాదురభూదితి
విధేయాని విధానాని నిస్పాదయితుముత్సుకః
ముఖ్యమంత్రీ జయత్యాప్తోమేధావీ చంద్రశేఖరః’
ఈ శ్లోకం పుస్తకం అట్టపైనే దర్శనమిస్తుంది ఇక మొదటి శ్లోకం చూస్తే.. కల్వకుంట్ల శశీ చంద్రశేఖరో లోకావిశ్రుతః ధృఢవ్రతస్తెలంగాణ సాధకో జయ మాప్నుయాత్.. అంటూ కీర్తించారు.. శ్రీ కల్వకుంట్ల మిహిరః ప్రియముఖ్యమంత్రీ వాగ్మీ విధిజ్ఞనుతధీర్ నృపనీతివేదీ.. శ్రీచంద్రశేఖర ఇతి ప్రథితో గుణజ్ఞో రాష్ట్రభివృద్ధి మనిశం బహుధా కరోతి ప్రజాపాలనాంక్తా ప్రజామోదమంక్తా ప్రజాశక్తిపోష్టా ప్రజావృత్తితోష్టా ప్రజా..పాయ భంక్తా ప్రజా..యాభిమంతా ప్రజాక్షేమకర్తా జయత్యేష నేత అంటూ సీఎం కేసీఆర్ గురించి శ్లోకాలు రచించారు.