ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆ నిరుపేద మనస్తాపం చెందాడు. తొలుత జాబితాలో ఉన్న పేరు ఆ తర్వాత ఎందుకు మాయమైందని మథనపడ్డాడు. దీనికి కాంగ్రెస్ నాయకులే కారణమని భావించాడు. ‘ఇందిరమ్మ ఇల్లు గురించి నా చావుకు కారణం కాంగ్రెస్ నాయకులే’ అన్న సూసైడ్ నోట్ తన చేతిపై రాసుకొని ఆ తర్వాత ఉరేసుకుని తనువు చాలించాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
యాచారం, మే 30: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (44)కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఆ కుటుంబం దరఖాస్తు చేసుకున్నది. ఆ కుటుంబానికి సొంతిల్లు లేకపోవడంతో మొదట్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో ఆ కుటుంబం పేరు వచ్చింది. చివర ప్రకటించిన జాబితాలో అతని పేరు రాలేదు. తొలి విడత ఎంపికైన లబ్ధిదారులు ముగ్గు పోసుకొని ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టారు. అది చూసిన అశోక్ లిస్టు కోసం వెతికాడు. దానిలో తన పేరు లేకపోవడంతో తనకు ఇందిరమ్మ ఇల్లు రాదని మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ‘ఇందిరమ్మ ఇల్లు గురించి నా చావుకు కారణం కాంగ్రెస్ నాయకులే’ అంటూ తన చేతిపై సూసైడ్ నోట్ రాసుకొని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణలు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు వస్తుందని గంపెడాశతో ఉన్న అశోక్ జాబితాలో పేరు లేకపోవడంతో తనకు ఇల్లు రాదని మనస్తాపానికి గురైనట్టు స్థానికులు తెలిపారు. గ్రామంలో వార్డు మాజీ సభ్యుడిగా కొనసాగిన అశోక్ సొంతింటికి నోచకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ నాయకుల వల్లే తన భర్త ఉరేసుకొని చనిపోయాడని అశోక్ భార్య బోరున విలపిస్తూ చెప్పింది. కాంగ్రెస్ నాయకులే ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుంచి తమ పేరు తొలగించారని ఆరోపించింది. ఇల్లు మంజూరైందనే ఆశతో ఇంటి స్థలం చూసుకునే లోపే మంజూరైన ఇంటిని రద్దు చేయించారని ఆవేదన వ్యక్తంచేసింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని, ఉన్న ముగ్గురు ఆడపిల్లలను ఎలా పోషించాలని కన్నీరు మున్నీరుగా విలపించింది. మృతదేహం వద్ద ముగ్గురు ఆడపిల్లలతో భార్య రోదిస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న అశోక్ మృతదేహంతో అతని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు, చింతపట్ల గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, పీఏఈసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి అలంపల్లి నరసింహ నేతృత్వంలో ఆయా పార్టీల నా యకులు, కార్యకర్తలు వారికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. అశోక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీడీవో శైలజ, పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌రెడ్డి అక్కడకు చేరుకొని వారితో మాట్లాడారు. అశోక్ కుటుంబానికి 120గజాల ఇంటి స్థలంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అశోక్ భార్యకు వితంతు పింఛన్ అందించేందుకు కృషి చేస్తామని, అ తని కూతుళ్ల చదువుకు ప్రభుత్వ సహకారం అందిస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
పేదలు ఇల్లు దక్కకపోవడంతో ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారని సీపీఎం నేత జాన్‌వెస్లీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదన్న మనస్తాపంతో యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు.