హిమాయత్ నగర్, మార్చి 29: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించిన గ్రూప్-1 మెయిన్ పరీక్ష ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జనార్దన్ ఆరోపించారు. తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు తక్కు వ మార్కులు వచ్చాయని, పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలుగు అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం హిమాయత్‌నగర్ తెలుగు అకాడమీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత తెలుగు అకాడమీ పుస్తకాలు చదవి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారని తెలిపారు. తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు పనికిరావని, వీటిని ప్రామాణికంగా తీసుకోలేమని టీజీపీఎస్సీ హైకోర్టుకు ఆఫిడవిట్ సమర్పించడం సరికాదని పేర్కొన్నారు.
అనుభవం లేని అధ్యాపకులతో పేపర్లను దిద్దించి.. అభ్యర్థులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. తెలుగుమీడియం అభ్యర్థులకు మార్కు లు తగ్గడం పలు అనుమానాలకు తావువిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. తెలుగు అభ్యర్థుల అన్యాయంపై ఆకునూరి మురళి ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. గ్రూప్-1 తెలుగు అభ్యర్థులకు న్యాయం జరగకపోతే ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.